Published : 21 Jan 2022 02:43 IST

అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ అరెస్టు

దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాకు కొకైన్‌ సరఫరా

తొలిసారిగా వినియోగదారులూ అరెస్టు

నిందితుడు టోనీ (ముసుగు వేసిన వ్యక్తి) నుంచి స్వాధీనం చేసుకున్న కారు, సెల్‌ఫోన్లను చూపిస్తున్న సీపీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్‌ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లర్‌ టోనీని హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ముంబయి కేంద్రంగా నాలుగేళ్లుగా డ్రగ్స్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తీసుకువచ్చామని, అతడి నుంచి కారు, 10 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకుని గురువారం జైలుకు తరలించామని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఉత్తర మండలం పోలీసులు పది రోజులుగా ముంబయిలో మకాం వేశారని, అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారని వెల్లడించారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లో తొమ్మిది మంది డ్రగ్‌ వినియోగదారులను కూడా అరెస్టు చేశామని వివరించారు. దక్షిణాఫ్రికాలో ఉంటున్న స్టార్‌బాయ్‌ అనే వ్యక్తి నుంచి నౌకల ద్వారా డ్రగ్స్‌ టోనీకి చేరుతున్నాయన్నారు.

దుస్తుల వ్యాపారం పేరుతో ముంబయికి..

నైజీరియాకు చెందిన టోనీ అబియా మార్షా (37) తొమ్మిదేళ్ల క్రితం వ్యాపార వీసాతో ముంబయికి వచ్చాడు. తూర్పు అంధేరిలో ఓ చిన్న గదిలో నివసిస్తూ, అక్కడే ఉన్న నైజీరియన్లతో పరిచయం పెంచుకున్నాడు. లోదుస్తులు కొని నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. అనంతరం మీరా భాండియార్‌, వాసైవిరార్‌ ప్రాంతాల్లోని నైజీరియన్ల వద్దకు వెళ్లాడు. వారిలో కొంతమంది డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తుండడడంతో తానూ అదేబాట పట్టాడు. 2017 నుంచి సొంతంగా డ్రగ్స్‌ తెప్పించుకోవడం, నలుగురు ఏజెంట్లను నియమించుకోవడం, వారి ద్వారా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్‌ ప్రాంతాలకు కొకైన్‌ సరఫరా చేయడం మొదలు పెట్టాడు. ముంబయిలో నైజీరియన్‌ యువతి లోవత్‌ యూసుఫ్‌తో సహజీవనం చేస్తున్నాడు. తన ఏజెంట్లు ఇమ్రాన్‌ బాబూ షేక్‌, నూర్‌మహ్మద్‌ ఖాన్‌ల ద్వారా హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. ఆఫ్రికా నుంచి గ్రాము కొకైన్‌ రూ.3 వేలకు తెప్పించి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తున్నాడు.

ఎక్కడా కనిపించడు.. అంతా ఇంటర్నెట్‌ ఫోన్‌

టోనీ రూ.కోట్లలో కొకైన్‌ వ్యాపారం నిర్వహిస్తున్నా, తాను బయటపడడు. తన ఏజెంట్లు ఇమ్రాన్‌ బాబూ షేక్‌, నూర్‌ మహ్మద్‌ ఖాన్‌, అల్తాఫ్‌, పర్వేజ్‌, రహమత్‌, ఇర్ఫాన్‌, ఫిర్దోస్‌లకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కనిపించలేదు. డ్రగ్స్‌ విక్రయించినందుకు వారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కమీషన్‌ ఇచ్చేవాడు. వారితో ఎప్పుడూ ఇంటర్నెట్‌ ఫోన్లోనే మాట్లాడేవాడు. హైదరాబాద్‌ పోలీసులు కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్‌ బాబూ షేక్‌, నూర్‌మహ్మద్‌లను అరెస్టు చేయగానే.. అతడి ఫోన్లలో సంభాషణలను తీసేశాడు. దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇంటర్నెట్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థలను సంప్రదించి అతడి కదలికలను తెలుసుకుని పట్టుకోగలిగారు.

వినియోగదారుల్లో బడా వ్యాపారులు

మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ సర్కారు కఠినంగా వ్యవహరిస్తోందన్న సందేశం బలంగా వెళ్లేందుకు పోలీసులు తొలిసారిగా డ్రగ్స్‌ వినియోగదారులను అరెస్టు చేశారు. టోనీపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు అతడిచ్చిన సమాచారం ఆధారంగా హిమాయత్‌నగర్‌లో ప్రముఖ రియల్టర్‌ నిరంజన్‌కుమార్‌ జైన్‌, బంజారాహిల్స్‌లో ఉంటున్న గుత్తేదారు శాశ్వత్‌జైన్‌, గౌలిపురా నివాసి యజ్ఞానంద్‌ అగర్వాల్‌తోపాటు దండు సూర్యసుమంత్‌రావు, బండి భార్గవ్‌, వెంకట్‌ చలసాని, తమ్మినీడి సాగర్‌, అలఘాని శ్రీకాంత్‌, గోడి సుబ్బారావులను అరెస్టు చేశారు. టోనీ నుంచి నిరంజన్‌కుమార్‌ జైన్‌ 30 సార్లు కొకైన్‌ తీసుకున్నాడని సీవీ ఆనంద్‌ తెలిపారు. నిరంజన్‌జైన్‌కు రూ.వెయ్యి కోట్ల వ్యాపారాలున్నాయని, మిగిలినవారు కూడా రూ.వందల కోట్లలో వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. నిరంజన్‌జైన్‌, శాశ్వత్‌జైన్‌లు వారి డ్రైవర్లు, ఆఫీస్‌బాయ్‌ల చరవాణులతో టోనీకి డిజిటల్‌ రూపంలో సొమ్ము చెల్లిస్తూ, ఏజెంట్ల ద్వారా కొకైన్‌ తీసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్‌ వాడితే సినిమా పరిశ్రమకు చెందిన వారినీ వదలబోమని సీపీ అన్నారు. మరో నలుగురు నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని