రెండు భాగాలుగా ఒక్కో పాఠ్య పుస్తకం

రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒక్కో సబ్జెక్టుకు రెండు పాఠ్య పుస్తకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం

Published : 21 Jan 2022 04:50 IST

ప్రభుత్వ తాజా నిర్ణయంతో బడి సంచి బరువు పెరగకుండా మార్గం

భాషా సబ్జెక్టులు తప్ప మిగిలినవి రెండుగా ముద్రణ

సర్కారు బడుల్లో విద్యార్థులకు పంపిణీ

విక్రయ పుస్తకాలు మాత్రం యథావిధిగానే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒక్కో సబ్జెక్టుకు రెండు పాఠ్య పుస్తకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. టర్మ్‌-1కు ఒక పుస్తకం, టర్మ్‌-2కు మరో పాఠ్య పుస్తకాన్ని పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యంలో 1-7 తరగతుల విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒకే పాఠ్య పుస్తకం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉండాలని, ఒక వైపు తెలుగు, మరో వైపు ఆంగ్లం ఉండేలా ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రకరకాల పుస్తకాలు, మంచినీటి బాటిళ్లు, ఇతరత్రా సామగ్రితో బడి సంచి బరువు అధికంగా ఉంటోంది. ఈ విషయం సర్వేలోనూ స్పష్టమైంది. ఈ క్రమంలో తెలుగు, ఆంగ్లం రెండు భాషలతో పుస్తకాలను ముద్రించి ఇస్తే సంచి బరువు భారీగా పెరుగుతుందని, అది అంతిమంగా విద్యార్థుల శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం 1-10 తరగతులకు పరీక్షలు కూడా సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)-1, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌-2 పేరిట జరుపుతున్నారు. కాకపోతే ఎస్‌ఏ-1కు సగం సిలబస్‌ ఉంటుంది. ఎస్‌ఏ-2కు మొత్తం సిలబస్‌తో పరీక్షలు జరుపుతారు. అదేవిధంగా ఎస్‌ఏ-1 సిలబస్‌కు ఒక పాఠ్య పుస్తకం, ఎస్‌ఏ-2కు మిగిలిన పాఠ్య ప్రణాళికతో మరో పుస్తకాన్ని టర్మ్‌-1, 2 పేరిట విద్యా శాఖ ముద్రించి ఇవ్వనుంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ)లో ఫైనల్‌ ప్రూఫ్‌ను సిద్ధం చేస్తున్నారు. అధికారులు తుది సీడీలను అప్పగిస్తే త్వరలోనే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణా విభాగం పుస్తకాల ముద్రణ ప్రారంభించనుంది.

భాషేతర పుస్తకాలు మాత్రమే

ఒకటి, రెండు తరగతులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులు, 3-5వ తరగతి వరకు వాటికి అదనంగా పరిశీలన విజ్ఞానం, గణితం సబ్జెక్టు ఉంటుంది. 6, 7 తరగతుల్లో తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు గణితం, జనరల్‌ సైన్స్‌, సాంఘికశాస్త్రం సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో భాషాపరమైన తెలుగు, ఆంగ్లం, హిందీ లాంటివి ఏ మాధ్యమం వారికైనా పుస్తకాలు ఒకటే. ఇక మిగిలిన సబ్జెక్టు పుస్తకాలను మాత్రమే రెండు మాధ్యమాల్లో, రెండు పుస్తకాలుగా ముద్రించి ఇస్తారు.


మరో 50 లక్షల పుస్తకాలు అధికం!

ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 1-10 తరగతులు చదివే సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు 1.45 కోట్ల పాఠ్య పుస్తకాలను అందజేస్తున్నారు. ఇప్పుడు రెండు పుస్తకాల విధానం వల్ల 1-7 తరగతుల కోసం కనీసం మరో 50 లక్షలు పుస్తకాలను అధికంగా ముద్రించాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు వాటిని గతంలో మాదిరిగానే ముద్రిస్తారు. ప్రైవేట్‌లో ప్రస్తుతం 97 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని