
కేంద్ర బడ్జెట్లో రూ.7,778 కోట్లు కేటాయించాలి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రానున్న కేంద్ర బడ్జెట్లో రూ.7,778 కోట్లను ప్రత్యేకంగా కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం లేఖ రాశారు. రాష్ట్ర పురపాలకశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా నిధుల తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ స్మార్ట్ సిటీగా మార్చే క్రమంలో అనేక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. ప్రధానంగా రవాణాసౌకర్యం, రహదారుల అభివృద్ధి, మూసీ ప్రాంత అభివృద్ధి, పటిష్ఠ మురుగునీటి వ్యవస్థ సహా వివిధ ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. వీటికి కేంద్రం తనవంతుగా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పూర్తివివరాలను లేఖలో వివరించారు.
* హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ-కోకాపేట-నార్సింగ్ కారిడార్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎమ్మార్టీఎస్) ప్రాజెక్టుకు రూ.3,500 కోట్ల వ్యయమవుతుంది. 2030 నాటికి 30 కి.మీ.నిడివి ఉన్న మార్గంలో ఎమ్మార్టీఎస్ ద్వారా రోజుకు అయిదు లక్షల మంది ప్రయాణించనున్నారు.15 శాతం వాటాగా కేంద్రం రూ.450 కోట్లు ఇవ్వాలి.
* హైదరాబాద్, దాని చుట్టుపక్కల రహదారులు, కారిడార్లు, 17 లింక్‌రోడ్ల అభివృద్ధికి రూ.2,400 కోట్లు అవసరం కాగా మూడోవంతు వాటాగా కేంద్రం రూ.800 కోట్లు కేటాయించాలి.
* హైదరాబాద్‌ను గ్లోబల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగా వంద కి.మీ. మేర స్కైవాక్‌లు, 166 కి.మీ. మేజర్ కారిడార్లు, 348 కి.మీ. మేజర్ రహదారులు, 1,400 కి.మీ. ఇతర రోడ్లు, ఫ్లైఓవర్లు సహా వివిధ నిర్మాణాలకు మొదటి దశలో రూ.5,937 కోట్లు అవసరం కాగా పురపాలకశాఖ బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకుంటోంది. రెండో దశ ఎస్ఆర్డీపీకి రూ.14,000 కోట్లు, మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధికి రూ.11,500, ఎలివేటెడ్ కారిడార్లకు రూ.9,000 కోట్ల చొప్పున మొత్తం రూ.34,500 కోట్లు అవసరమవుతాయి. ఇందులో పదోవంతు అంటే రూ.3,450 కోట్లు కేంద్రం ఇవ్వాలి.
* వరంగల్‌లో చేపట్టే మెట్రో నియో ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్రం 20 శాతం వాటాగా రూ.184 కోట్లు కేటాయించాలి.
* రాజధానిలో రూ.8,684 కోట్లతో చేపట్టే ఎస్టీపీలు, సీవర్ నెట్వర్క్, ఓఆర్ఆర్ వరకు అనుసంధానం చేసే సీవర్ ప్రాజెక్టుకు మూడోవంతు నిధులు కావాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.