
విద్యా సంస్థలతో కలిసి కొత్తతరం సాంకేతికతల అభివృద్ధి
ఆస్కి వెబినార్‌లో డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీష్‌రెడ్డి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రక్షణ రంగంలో కొత్తతరం సాంకేతికతల అభివృద్ధికి 300 విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని రక్షణ శాఖ ఆర్అండ్డీ కార్యదర్శి, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నట్లు చెప్పారు. పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు కలిసి పనిచేస్తే ప్రపంచస్థాయి సాంకేతికతలను భారత్ అభివృద్ధి చేయగలదని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం రక్షణ రంగ ఆర్అండ్డీని వేగవంతం చేయడంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఒకప్పుడు డీఆర్డీవో డిజైన్ రూపొందించి అభివృద్ధి చేసి ఇస్తే పరిశ్రమలు వాటిని ఉత్పత్తి చేసేవి. ప్రస్తుతం ప్రైవేటు రంగంలోని పరిశ్రమలు సొంతంగానే క్షిపణులు, బాంబులను సైతం స్వయంగా డిజైన్ చేసే స్థాయికి ఎదిగాయి. డీఆర్డీవో రెండు వేల పరిశ్రమలతో కలిసి పనిచేస్తోంది. అలాగే రక్షణ రంగ సాంకేతికతల్లో కృత్రిమ మేధ వినియోగంపై దృష్టి పెట్టాం. డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిలో మరింత వేగం పెంచాల్సి ఉంది. ప్రైవేటు సంస్థలు, అంకుర సంస్థలు వీటిపై బాగా పని చేస్తున్నాయి.
శాస్త్రవేత్తలకు ఐఐఎంలో శిక్షణ
శాస్త్రవేత్తలు డిజైన్ పరంగా పట్టు చూపిస్తున్నా.. మేనేజ్మెంట్, పరిపాలన నైపుణ్యాల్లో కొంత వెనకబడి ఉన్న మాట వాస్తవం. వీటిని అధిగమించేందుకు కీలక స్థానాల్లో ఉన్నవారికి ఐఐఎంలో శిక్షణ ఇప్పిస్తున్నాం. యాంటీ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి సైన్యం నుంచి ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పటికే సాంకేతికతను ఐదు కంపెనీలకు బదలాయించాం. క్షిపణులు, రాడార్లతో పాటు మరికొన్ని అంశాల్లో భారత్ ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించింది. ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్న మిగతా వాటిపై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం రక్షణ రంగంలో 60 శాతం స్వదేశీ ఉత్పత్తులు, టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. త్వరలోనే ఇది 80 శాతానికి చేరుతుంది. దేశీయంగా కొత్తతరం విమాన ఇంజిన్ల అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదివరకే అభివృద్ధి చేసిన కావేరి ఇంజిన్‌ను ఇతరత్రా వినియోగించుకునే అవకాశం ఉంది’’ అని వివరించారు. సమావేశంలో ఆస్కి ఛైర్మన్ కె.పద్మనాభయ్య తదితరులు మాట్లాడారు.