
ఆంక్షల నడుమ ఎగిసిన ఆకాంక్షలు
డీఆర్డీవోలో గత ఏడాది వరస ప్రయోగాలు
హైదరాబాద్ ల్యాబ్‌ల అసాధారణ సేవలు
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ ఆంక్షలు.. శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం.. లాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ప్రయోగశాలలు గతేడాది ఆసాధారణ పనితీరును కనబరిచాయి. నిర్దేశించుకున్న లక్ష్యంపై గురిపెట్టాయి. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు వరసగా క్షిపణి ప్రయోగాలతో పాటు కొత్త ఆయుధ వ్యవస్థలను పరీక్షించే పనులను నిర్విరామంగా చేపట్టాయి. 2020లో కొవిడ్ లాక్‌డౌన్‌తో వెనకబడిన ప్రయోగాలను గత ఏడాది విజయవంతంగా పూర్తి చేయడమే కాదు... సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత వేగం పెంచాయి.
మిథానిలోని ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ (ఏఎస్ఎల్)లు క్షిపణి ప్రయోగాలు, కొత్త ఆయుధ వ్యవస్థ పరీక్షల ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించాయి. ఇతర ల్యాబ్‌లతో కలిసి అత్యాధునిక రాడార్లు, ఏవియాక్స్, అల్గారిథమ్స్, ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్, రాకెట్ మోటార్స్, సాలిడ్ ప్రొపల్షన్ రాకెట్ వ్యవస్థల వరకు దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేశాయి. కొవిడ్ భయాలు, ఆంక్షల సమయంలో ఒడిశాలోని బాలాసోర్, ఏపీలోని విశాఖ, రాజస్థాన్‌లోని పోఖ్రాన్, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో ఆయుధ వ్యవస్థలను శాస్త్రవేత్తలు పరీక్షించారు.
* ఉపరితలం నుంచి ఉపరితలానికి పరీక్షించే అణ్వస్త్ర సామర్థ్యం కల్గిన బాలిస్టిక్ అగ్ని ‘పి’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.
* పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్తతరం క్షిపణి ‘ప్రళయ్’ను 24 గంటల వ్యవధిలో రెండుసార్లు విజయవంతంగా ప్రయోగించారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), ఇతర ల్యాబ్‌ల సహకారంతో ప్రళయ్‌ను రూపొందించారు.
* ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి (ఎస్ఆర్సామ్)ను పరీక్షించారు.
* బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణిని, యుద్ధ విధ్వంసక క్షిపణి సంత్ను ప్రయోగించారు.
* కొత్తతరం క్షిపణులు ఆకాశ్, ప్రైమ్‌లను తొలిసారి ఒడిశాలోని చాందీపూర్‌లో పరీక్షించారు. దీర్ఘశ్రేణి బాంబ్ (ఎల్ఆర్ బాంబ్)ను గత ఏడాది చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.