నేరాల ఛేదనలో సాంకేతిక దన్ను

హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు నెలల కిందట ఓ దొంగతనం జరిగింది. సమీపంలోనే సీసీ కెమెరాలు ఉన్నా సాంకేతిక కారణాల వల్ల దృశ్యాలు అస్పష్టంగా ఉన్నాయి.

Published : 21 Jan 2022 04:50 IST

ఆధునిక పరిజ్ఞానంతో దర్యాప్తులు సులభతరం

ఈనాడు, హైదరాబాద్‌: హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు నెలల కిందట ఓ దొంగతనం జరిగింది. సమీపంలోనే సీసీ కెమెరాలు ఉన్నా సాంకేతిక కారణాల వల్ల దృశ్యాలు అస్పష్టంగా ఉన్నాయి. పోలీసులు ఆ దృశ్యాలను సైబర్‌ల్యాబ్‌కు పంపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దృశ్యాల స్పష్టత పెంచి చూశారు. దొంగ ముఖాన్ని గుర్తించి, రెండు రోజుల్లో పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పోలీసుల దర్యాప్తులో బాగా అక్కరకు వస్తోందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. నేరస్థులను పట్టుకోవడానికి, నేర నిరూపణకు ఇది తిరుగులేని ఆధారమవుతోంది. ఆధునిక పరిజ్ఞానం వినియోగానికి తెలంగాణ పోలీసులు అధిక ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. సీసీ కెమెరాల ఏర్పాటు మొదలు అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానం చేసే క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం, ఆధునిక కంట్రోల్‌రూం నిర్మాణం వంటి వాటిలో దేశంలోనే తెలంగాణ ముందుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8.5 లక్షల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. ఒక్కో కెమెరా వెయ్యిమంది పోలీసులకు సమానమని చెబుతుంటారు. ఇప్పుడు శాంతిభద్రతలకు సంబంధించి ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే సమీపంలోని సీసీ కెమెరాలపైనే  ఆధారపడుతున్నారు. గత ఏడాది మొత్తం 22,781 కేసుల పరిష్కారానికి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలే దోహదం చేశాయి. నేరస్థలంలో దొరికే ఆధారాలు కూడా దర్యాప్తులో కీలకమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని మారుమూల ప్రాంతాల్లో జరిగే నేరాల్లోనూ పటిష్ఠమైన ఆధారాలు సేకరించేలా రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ క్లూస్‌ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మొత్తం 2969 కేసులను పరిశీలించగా వాటిలో 1638 కేసుల్లో ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకోగలిగారు. వీడియోల్లో అస్పష్ట దృశ్యాల నాణ్యతను పెంచే పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడంతో.. నిందితుల ముఖాలను గుర్తించగలుగుతున్నారు. ఇలా గత ఏడాది మొత్తం 2283 కేసులు పరిష్కరించగలిగారు. సైబర్‌ నేరాల్లో ఆధారాల సేకరణకు ప్రత్యేకంగా సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 426 కేసులు ఛేదించగలిగారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం కేసుల దర్యాప్తులో కీలకంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని