Published : 22 Jan 2022 02:57 IST

మీ సత్తా ఎంత?

ఇంజినీరింగ్‌ విద్యార్థుల సామర్ధ్యాలను అంచనా వేసే పోర్టల్‌
‘స్టాన్‌ఫర్డ్‌’ సహకారంతో రూపొందించిన ఏఐసీటీఈ

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌లో చేరిన విద్యార్థులు ఆ చదువుకు తగ్గట్లు నైపుణ్యాలు సాధించలేకపోతే వారి భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. తొలి ఏడాది నుంచే వారు ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను ఎంత మేరకు అలవర్చుకుంటున్నారో పరీక్షిస్తే.. తాము ఇంకెన్ని అంశాలు నేర్చుకోవాలి?.. వేటిలో వెనుకబడ్డామో తెలుసుకోగలిగితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ ఆలోచనతోనే అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)- స్టూడెంట్‌ లెర్నింగ్‌ ఎబిలిటీ పేరిట ఆ సౌలభ్యానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులతోపాటు అధ్యాపకులు సైతం తమ నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

స్టాన్‌ఫర్డ్‌లోనూ అమలు..
ఈ ప్రాజెక్టును అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తమ విద్యార్థులకు అమలు చేసింది. తర్వాత దాన్ని అమెరికా, రష్యా, చైనాతోపాటు భారత్‌లో 50 కళాశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. తర్వాత ఆ వర్సిటీ భారత్‌లోని ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో లోపాలను గుర్తించి... వాటిని తొలగించేందుకు పలు సిఫారసులు చేసింది. వాటిని అధ్యయనం చేసిన ఏఐసీటీఈ నేషనల్‌ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌ (ఎన్‌పీఐయూ) సంయుక్త భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రారంభించింది. ఇటీవలే దీన్ని అందుబాటులోకి తీసుకురాగా, 85 వేల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 58 వేల మంది తమను పరీక్షించుకున్నారు.

పరీక్షించుకోవాల్సిన అంశాలు...
యూజీతోపాటు పీజీ విద్యార్థులు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. విద్యార్థుల్లో ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా సమస్యలను గుర్తించడం, పరిష్కరించడం, క్రిటికల్‌ థింకింగ్‌, ఇన్నోవేషన్‌ తదితర వాటిని పెంచేలా ఉన్నత స్థాయి ఆలోచనా నైపుణ్యాలు (హయ్యర్‌ ఆర్డర్‌ థింకింగ్‌ స్కిల్స్‌- హెచ్‌ఓటీఎస్‌), కోర్‌ సబ్జెక్టులైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, సీఎస్‌ఈ, గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలు, వివిధ డిమాండ్‌ ఉన్న అంశాలైన కృత్రిమ మేధ, బ్లాక్‌ చైన్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, రోబోటిక్స్‌, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ తదితర అంశాలను పరీక్షిస్తారు.

ప్రస్తుతం పోర్టల్‌లో 2 లక్షల బహుళ ఐచ్ఛిక ప్రశ్నలున్నాయి. వాటిని సాధన చేయవచ్చు. ఉదాహరణకు బీటెక్‌లో చేరిన విద్యార్థి తాము చదివే ఏడాదికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొని తమ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. పరీక్ష పూర్తయిన తర్వాత నివేదిక అందుతుంది.

* పోర్టల్‌ చిరునామా: www.aslap.aicteindia.org

దీని ద్వారా ఆయా కళాశాలలు, అధ్యాపకులు, విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రశ్నలు ఆంగ్లంలో ఉన్నా వాటిని ఆయా ప్రాంతీయ భాషల్లో కూడా తీసుకురానున్నారు. నూతన జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని