
2న అంకురార్పణ.. 14న మహా పూర్ణాహుతి
సమతామూర్తి ఉత్సవాలకు షెడ్యూల్ ఖరారు
5న రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి పేరిట 216 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 2 నుంచి 14 వరకు విగ్రహావిష్కరణ మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ అతిథేయులుగా వ్యవహరించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరుకానున్నారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం సిద్ధం కాగా.. చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశాల (ఆలయాల)కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం అభివృద్ధి చేస్తున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా బెంగళూరు జాతీయ రహదారి నుంచి సిమెంటు రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మరో రోడ్డు నిర్మాణం పూర్తి కావొచ్చింది.
రామానుజుని ఆలోచనలు అనుసరణీయం: చినజీయర్‌స్వామి
‘‘సమాజంలో అసమానతలు తొలగి సమ సమాజ స్థాపనకు రామానుజాచార్యులు ఎంతో కృషి చేశారు. ఆయన అవతరించి 2017నాటికి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఈ కేంద్రం ఏర్పాటుతో ఆయన బోధనలు మరో వెయ్యేళ్లు వర్ధిల్లుతాయన్న నమ్మకం ఉంది. ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలంటే రామానుజాచార్యుల ఆలోచనలు ఎంతో అనుసరణీయం. సమతామూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. యజ్ఞకుండాల్లో సమర్పించే హవిస్సుల నుంచి ఆవిష్కృతమయ్యే శక్తి ప్రకృతిని ప్రేరేపించి సర్వ మానవాళిహితానికి ఉపకరిస్తుంది. ఏదైనా క్రతువు నిర్వహిస్తున్నామంటే అందులో సమాజహితం కూడా ఉండాలి. ప్రస్తుతం ఒమిక్రాన్ నుంచి ఉపశమనానికి యజ్ఞశక్తి ఉపకరిస్తుంది. తమిళనాడులోని ఒక గ్రామంలో మాత్రమే ఉన్న సామవేద నిష్ణాతులు, తిరుపతి దేవస్థానం వేద పండితులు ఈ మహాక్రతువులో పాలొని పారాయణం చేస్తారు’’
ఉత్సవాలలో కీలకఘట్టాలు
* ఫిబ్రవరి 2న ఉత్సవాలకు అంకురార్పణ
* 3న అగ్ని ప్రతిష్ఠ
* 5న సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారు.
* 8న సామూహిక ఆదిత్య హృదయం జపం
* 11న సామూహిక ఉపనయనం
* 12న సామూహిక విష్ణుసహస్రనామ జపం
* 13న 120 కిలోల రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు.
* 14న మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. సమతామూర్తి చుట్టూ నిర్మించిన 108 దివ్య దేశాలకు తొలి శాంతి కల్యాణాలు జరుగుతాయి. ఆ తర్వాతే రామానుజ మూర్తి, 108 ఆలయాల సందర్శనకు ప్రజలను అనుమతిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.