
ప్రారంభమైన జ్వర సర్వే
ఈనాడు, హైదరాబాద్, పంజాగుట్ట, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇంటింటి జ్వర సర్వే శుక్రవారం ప్రారంభమైంది. ‘ఇంటింటా ఆరోగ్యం’ పేరిట వైద్యసిబ్బంది అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తున్నారు. ప్రతి బృందంలోనూ ఆశా, ఏఎన్ఎం, పురపాలక, పంచాయతీరాజ్ సిబ్బంది ఉన్నారు. మూడోదశ ఉద్ధృతిలో భాగంగా చేపట్టిన ఈ సర్వేను.. వారం రోజుల్లోగా తొలివిడత పూర్తిచేయాలని వైద్యసిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర లక్షణాలున్నవారిని గుర్తించి, అక్కడిక్కడే వెంటనే హోం ఐసొలేషన్ ఔషధ కిట్లను అందజేశారు. తొలిరోజు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖైరతాబాద్‌లోని హిల్‌టాప్ కాలనీలో పర్యటించి సర్వేను పరిశీలించారు. కోటికి పైగా హోం ఐసొలేషన్ కిట్లను సిద్ధం చేశామని, రోజుకు లక్షకు పైగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలుపుకొని మొత్తంగా 56 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కొత్తగా 4,416 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 4,416 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అంటే కేవలం 20 రోజుల వ్యవధిలో కొత్తగా ఒకరోజు నమోదయ్యే కేసుల సంఖ్య ఏకంగా 4 వేలకు పైగా పెరిగింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,26,819కి పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 2 మరణాలు సంభవించగా.. ఇప్పటివరకు 4,069 మంది కన్నుమూశారు. ఈనెల 21న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్ సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసింది. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,670 కరోనా కేసులు నమోదు కాగా..మేడ్చల్ మల్కాజిగిరిలో 417, రంగారెడ్డిలో 301, ఖమ్మంలో 117, సంగారెడ్డిలో 99, మహబూబ్‌నగర్‌లో 99, కరీంనగర్లో 91 చొప్పున కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
ఏపీలో 13వేల పాజిటివ్‌లు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 44,516 నమూనాలను పరీక్షించగా.. 13,212 మంది కొవిడ్ బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 2,244 కేసులు నమోదయ్యాయి.
కరోనా కాలంలో ఇదేం వరుస!
జనవరి మొదటి వారం నుంచి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అనుమానితులు పెద్దసంఖ్యలో కరోనా నిర్ధారణ కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. వీరి రాకతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు నిండిపోతున్నాయి. ఒక వరుసలో నిలబడి టోకెన్ తీసుకోవాలి. ఆపై మరో వరసలో ఉండి పరీక్షలు చేయించుకోవాలి. ఇలా నాలుగైదు గంటలు ఉంటే గానీ పరీక్షలు పూర్తి కావడం లేదు. ఎక్కడా భౌతిక దూరం కనిపించటం లేదు. ఈ క్రమంలో గంటల కొద్దీ క్యూలో నిలబడలేని వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం ఉదయం సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కనిపించిన దృశ్యమిది.
- ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.