Published : 22 Jan 2022 04:25 IST

అలహాబాద్‌ నరహంతకుడికి మద్రాసు శిక్ష!

‘భారతదేశం సంస్థానాల చిక్కుముడి! ప్రాంతాలు, కులాలు, మతాలుగా చీలిపోయింది. ఎవరి ప్రయోజనాలు వారివే. పక్క రాజ్యంలో ఏం జరిగినా పట్టించుకోరు’ అని బ్రిటిషర్లు భారతీయులపై వేసిన అపవాదును చెన్నపట్నం (చెన్నై) వాసులు పటాపంచలు చేశారు. ఉత్తరాదిన ఉన్న అలహాబాద్‌లో ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయ సిపాయిలను ఊచకోత కోసిన తెల్లవాడి విగ్రహాన్ని తమ నగరంలో ఏర్పాటు చేయటాన్ని నిరసించారు. సత్యాగ్రహం చేసి మరీ... ఆంగ్లేయుల హయాంలోనే ఆంగ్లేయుడి విగ్రహాన్ని తొలగింపజేశారు.

స్కాట్లాండ్‌కు చెందిన కర్నల్‌ జేమ్స్‌ జార్జ్‌ నీల్‌ ఈస్టిండియా కంపెనీలో సైనికుడిగా చేరి, మద్రాసు రెజిమెంట్‌లో 30 ఏళ్లపాటు పనిచేశాడు. రెండో బర్మా యుద్ధం సందర్భంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అనంతరం ఐరోపాకు వెళ్లి క్రిమియన్‌ యుద్ధంలో పాల్గొన్నాడు. 1857లో కర్నల్‌ హోదాలో చెన్నై తిరిగొచ్చాడు. అదే సమయంలో దేశంలో ఉత్తరాదిన తొలి స్వాతంత్య్ర పోరాటం జోరుగా సాగుతోంది. కాన్పుర్‌, అలహాబాద్‌, అవధ్‌, మేరఠ్‌ సంస్థానాలను సిపాయిలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ పోరాటాన్ని అణచివేయడానికి దక్షిణాది నుంచి దిల్లీకి పంపిన దళాల్లో నీల్‌ సారథ్యం వహించిన మద్రాస్‌ రెజిమెంట్‌ ప్రధానమైంది. వీరు మార్గమధ్యలో ఉండగానే కాన్పుర్‌లో కొందరు బ్రిటిష్‌ సైనికులు, వారి కుటుంబ సభ్యులు తిరుగుబాటుదారుల చేతిలో హతమయ్యారు. విషయం తెలుసుకుని... తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఉత్తర భారతానికి చేరుకున్న నీల్‌ - కాన్పుర్‌, అలహాబాద్‌లలో మారణహోమం సృష్టించాడు. ఈ రెండు సంస్థానాలను తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈ క్రమంలో వేల మంది సిపాయిలతో పాటు సాధారణ భారతీయ పౌరులనూ హత్య చేయించాడు. యుద్ధ ఖైదీలను ఉరికొయ్యలకు వేలాడదీశాడు. అలహాబాద్‌లో తిరుగుబాటుకు సహకరించిన వారిని ఇళ్లలో ఉంచి సజీవ దహనం చేయించాడు. వారిలో నానా సాహిబ్‌ కుమార్తె కూడా ఉండటం గమనార్హం. నీల్‌ సారథ్యంలో జరిగిన ఈ మారణకాండలో దాదాపు 10 వేల మంది భారతీయులను హత్య చేశారు. అందుకే ఆయనకు ‘అలహాబాద్‌ నరహంతకుడు’ అనే పేరు పడిపోయింది. చివరికి యుద్ధం కొనసాగుతుండగానే లఖ్‌నవూలో 1858 సెప్టెంబరు 25న సిపాయిల చేతిలో తనూ అంతమయ్యాడు.

అమరత్వం ఆపాదింపు
కానీ.. సిపాయిల తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కొని... భారత్‌లో తమ పాలన స్థిరపడేందుకు కృషి చేసిన నీల్‌ సేవలకు గుర్తింపుగా బ్రిటిషర్లు అతడికి అమరత్వం ఆపాదించారు. మద్రాస్‌ రెజిమెంట్‌లో అతనితోపాటు కలిసి పనిచేసిన హారిస్‌ అనే సైనికాధికారి మద్రాస్‌ తిరిగి వచ్చాక... మౌంట్‌రోడ్డులో 1861లో పది అడుగుల నీల్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. లఖ్‌నవూ కంటోన్మెంట్‌లో ఒక వీధికి నీల్‌ లేన్‌ అని, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఒకదానికి నీల్‌ ఐలండ్‌ అని నామకరణం చేశారు. వీటి పేర్లు ఇప్పటికీ అలాగే కొనసాగుతుండటం గమనార్హం. ఉత్తర, దక్షిణాలతో పాటు అన్నిరకాల విభజనలతో తమ పాలనను సుస్థిరంగా సాగిస్తున్న తెల్లవారికి మద్రాసువాసులు మాత్రం షాకిచ్చారు. అలహాబాద్‌లో నీల్‌ అకృత్యాలను మరచిపోలేదని చాటి చెప్పారు. మద్రాసు మౌంట్‌రోడ్డులోని జార్జ్‌ నీల్‌ విగ్రహాన్ని తొలగించాలని నినదిస్తూ 1927 ఆగస్టు 11న స్థానికులు ఆందోళన ప్రారంభించారు. ఇద్దరు నిరసనకారులు విగ్రహాన్ని సుత్తితో బాది, గడ్డపారతో తవ్వి... ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశారు. మద్రాసు మహాజన సభ, కాంగ్రెస్‌కు చెందిన మద్రాస్‌ ప్రొవెన్షియల్‌ కమిటీలు సైతం విగ్రహం తొలగించాలని తీర్మానాలు చేశాయి. అలహాబాద్‌ హంతకుడు... మద్రాసులో ప్రధాన సమస్యగా మారాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆందోళనకారులకు జైలు శిక్షలు విధించింది. పట్టణ బహిష్కరణలు చేసింది. అయినా... ప్రజలు వెనక్కి తగ్గలేదు. వరుస ప్రదర్శనలు నిర్వహించారు. అప్పట్లో మద్రాసును సందర్శించిన మహాత్మాగాంధీ సైతం వీరి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే... నిరసన పూర్తిగా అహింసా విధానంలోనే కొనసాగాలని సూచించారు. మద్రాసు నిరసనల హోరు లాహోర్‌ దాకా వినిపించింది. అయినా ఆంగ్లేయ ప్రభుత్వం చలించలేదు. 1928లో సైమన్‌ కమిషన్‌ రావడంతో ‘సైమన్‌ గోబ్యాక్‌’ నినాదాల వెల్లువలో... ఈ విగ్రహం తొలగింపు ఆందోళన సరిగా వినిపించలేదు. అంతర్లీనంగా మాత్రం స్థానికుల ఆకాంక్ష సజీవంగా కొనసాగింది. 1937లో జరిగిన ప్రొవెన్షియల్‌ ఎన్నికలలో సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. అదే అదనుగా నీల్‌ విగ్రహాన్ని తీసేయాలని మద్రాస్‌ కార్పొరేషన్‌లో ఉద్యమకారులు తీర్మానం చేయించారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం చివరకు నీల్‌ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసి... మ్యూజియానికి తరలించింది. అలా అలహాబాద్‌ నరహంతకుడికి మద్రాసు వాసులు తమవంతు శిక్ష విధించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని