Published : 22 Jan 2022 04:52 IST

తప్పదు ‘పరీక్ష’.. నీకు నీవే రక్ష!

ఇంట్లో ఈ పరికరాలు ఉన్నాయా?
జ్వరం.. బీపీ.. పల్స్‌.. ఆక్సిజన్‌ స్థాయులు తెలుసుకోండి
వేపరైజర్‌లను సిద్ధం చేసుకోండి
న్యూస్‌టుడే, కేపీహెచ్‌బీకాలనీ

ఇప్పుడు కరోనా మూడోవేవ్‌ నడుస్తోంది. వైరస్‌ సోకిందా లేదా అని తనిఖీ మొదలు దాని నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్‌ సోకిందా లేదా అనే అనుమానంతో సతమతమవుతున్నారు. జ్వరం మూడ్రోజుల్లో తగ్గకపోతే పరీక్ష తప్పదు. కిట్‌తో స్వీయ తనిఖీ కూడా చేసుకోవచ్చు. పాజిటివ్‌ అని తేలితే నిత్యం కొన్ని పరికరాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం ఉంది. జ్వరం, రక్తపోటు, పల్స్‌, ఆక్సిజన్‌ స్థాయి, ఆవిరిపట్టుకోవడం..ఇలా అన్నింటికీ పరికరాలున్నాయి. కంపెనీలను బట్టి.. మార్కెట్‌, ఆన్‌లైన్‌ ధరలను బేరీజు వేసుకుని నాణ్యమైన వాటిని కొనుగోలు చేసి ప్రాథమిక చికిత్స చేసుకోవాలి. పరిస్థితి విషమిస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిందే.


థర్మల్‌ స్క్రీన్‌

ఎందుకంటే : మామూలు థర్మామీటర్‌, ఈ థర్మల్‌స్క్రీన్‌ పనితీరు ఒకటే. థర్మామీటర్‌ను చంకలో లేదా నాలిక కింద ఉంచి శరీర ఉష్ణోగ్రత కొలుస్తారు. కరోనా నేపథ్యంలో ఒకరు వాడిన థర్మామీటర్‌ను మరొకరు వాడటం శ్రేయస్కరంకాదు.
ఎలా పనిచేస్తుంది : థర్మల్‌స్క్రీన్‌లోని ఇన్‌ఫ్రా రెడ్‌ లైట్‌ 5 సెం.మీ. దూరం నుంచే శరీరంలోని ఉష్ణోగ్రతను చూపిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ లేదా 98.7 ఫారెన్‌హీట్‌ దాటిందంటే అప్రమత్తమవ్వాలి.
మార్కెట్‌ ధర : రూ.750-రూ.3 వేల వరకు. (కంపెనీ ఆధారంగా సర్జికల్‌ దుకాణం ధర)
ఆన్‌లైన్‌ రేటు : రూ.800-రూ.2000 వరకు. రూ.50 వేలకుపైగా ధర పలికేవీ ఉన్నాయి. వీటిని కంప్యూటర్‌కి కూడా లింక్‌ చేసుకోవచ్చు.


పల్స్‌ ఆక్సీమీటర్‌

ఎందుకంటే : నాడి (పల్స్‌), శరీరంలోని ఆక్సిజన్‌ శాతం (ఆక్సీ) తెలుసుకునేందుకు
ఎలా పనిచేస్తుంది : ఈ పరికరంలోని లైట్‌ సోర్స్‌ ద్వారా శరీరంలోని ఆక్సిజన్‌ శాతం, నాడి, గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు.
పల్స్‌ సాధారణ స్థాయి : నిమిషానికి 72 సార్లు. రోగి పరిస్థితిని బట్టి కొందరిలో 72-80-90 వరకు... జ్వరం వచ్చిన వారిలో 100 వరకు కూడా ఉంటుంది.
ఆక్సిజన్‌ శాతం సాధారణ స్థాయి : ఆరోగ్యవంతులకు 95-100. ఛాతీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కొంత తక్కువ కూడా ఉండొచ్చు.  95 కంటే తక్కువైతే వైద్యుడిని సంప్రదించాలి
మార్కెట్‌ ధర : రూ.950-రూ.2500 వరకు.  (కంపెనీ ఆధారంగా సర్జికల్‌ దుకాణం ధర)
ఆన్‌లైన్‌ ధర : రూ.500-రూ.2 వేల వరకు


ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌

ఎవరు వాడాలి : శరీరంలో ఆక్సిజన్‌ శాతం 95 కంటే బాగా తక్కువగా ఉంటే ఈ పరికరాన్ని వాడాలి.
ఎలా పనిచేస్తుంది : ఈ పరికరంలో ఉంటే బాక్సులో పోసిన నీటికి.. అప్పటికే యంత్రానికి విద్యుత్తు సరఫరా ద్వారా ఏర్పడే గాలి తోడై శరీరానికి కాన్సన్‌ట్రేటర్‌ స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందిస్తుంది. అవసరమైతే అద్దెకు తెచ్చుకోవచ్చు. లేదంటే కొనుగోలు చేయొచ్చు.
కిరాయి : నెలకు రూ.2వేలు-రూ.5 వేల వరకు (యంత్ర సామర్థ్యాన్ని బట్టి)
మార్కెట్‌ ధర: రూ.35 వేలు-రూ.1.50 లక్షల వరకు. (కంపెనీ ఆధారంగా.. సామర్థ్యాన్ని బట్టి సర్జికల్‌ దుకాణం ధర)
ఆన్‌లైన్‌ ధర: రూ.15 వేలు-రూ.1.75 లక్షల వరకు


డిజిటల్‌ రక్తపోటు యంత్రం

ఎందుకంటే : గతంలో బీపీ తనిఖీకి వైద్యుడి వద్దకే వెళ్లేవారు. ఇప్పుడు ఈ పరికరంతో ఎవరైనా ఇంట్లో పరీక్షించుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది : యంత్రానికి ఉన్న పైపు వస్త్రాన్ని చేతికి చుట్టినప్పుడు గుండె ధమనుల్లో ప్రవహించే రక్త వేగాన్ని ఈ యంత్రం గుర్తించి రక్తపోటు స్థాయిని తెలుపుతుంది.
సాధారణ స్థాయి : 120/80 (సిస్టాలిక్‌.. 120, డయాస్టాలిక్‌.. 80) ఉండాలి. కొంత హెచ్చుతగ్గులున్నా ఫరవాలేదు.
ప్రమాద స్థాయి: సిస్టాలిక్‌, డయాస్టాలిక్‌కంటే బాగా తక్కువ ఉంటే లోబీపీ, సిస్టాలిక్‌ 140 కంటే ఎక్కువ ఉంటే హైబీపీగా నిర్ధారిస్తారు.
మార్కెట్‌ ధర : రూ.1,100-రూ.3 వేల వరకు (కంపెనీ ఆధారంగా సర్జికల్‌ దుకాణం ధర)
ఆన్‌లైన్‌ ధర : రూ.800-రూ.3,500 వరకు


వేపరైజర్లు (ఆవిరి పట్టే పరికరాలు)

ఎందుకంటే: ఈ పరికరాలతో ఆవిరి పట్టుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇందులో వేడినీళ్లు పోసి జిందాతిలిస్మాత్‌ వేస్తే వచ్చే ఆవిరితో వైరస్‌ నశిస్తుందని నిపుణులంటున్నారు. ముక్కు, చెవులు, గొంతు మార్గాల్లో వైరస్‌, బ్యాక్టీరియా నాశనమవుతుంది. ఎక్కువ ఆవిరి పట్టడం మంచిది కాదు.
మార్కెట్‌ ధర : రూ.200- రూ.3,000 వరకు. (కంపెనీ ఆధారంగా సర్జికల్‌ దుకాణం ధర)
ఆన్‌లైన్‌ ధర: రూ.200- రూ.800 వరకు


ర్యాట్‌ (ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌) కిట్‌

ఎలా పనిచేస్తుంది : ఈ కిట్‌లో 2 గీతలుంటాయి.ఒకటి కంట్రోల్‌. రెండోది టెస్ట్‌ గీత. ముక్కు, గొంతులో నుంచి తీసిన నమూనాను వీటీఎం - వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియా (ద్రావణం)లో కలపాలి. దీన్ని కిట్‌లో వేయాలి. శరీరంలో వైరస్‌ ఉంటే ఈ ద్రావణంలోనూ వైరస్‌ బతికే ఉంటుంది.
ఇలా తెలుస్తుంది: 2 గీతలు కనిపిస్తే పాజిటివ్‌.. 1 గీత కనిపిస్తే నెగెటివ్‌. (కంట్రోల్‌ గీత కనిపిస్తేనే కిట్‌ పనిచేస్తున్నట్లు)
మార్కెట్‌ ధర: రూ.200-రూ.3 వేల వరకు (కంపెనీ ఆధారంగా సర్జికల్‌ దుకాణం ధర)
ఆన్‌లైన్‌ ధర: రూ.200-రూ.4 వేలు

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని