విగ్రహం ఒక్కటే చాలదు మత నిగ్రహమూ కావాలి

‘‘విభజన, మత రాజకీయాలను ఆపకపోతే 1947లో ఏం జరిగిందో అదే మళ్లీ పునరావృతమవుతుంది. అప్పట్లో నేతాజీ భారత్‌ తిరిగి వచ్చి ఉంటే దేశం, బెంగాల్‌ విడిపోయి ఉండేవి కావు. కాబట్టి దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే నేతాజీ భావజాలాన్ని పాటించటమొక్కటే మార్గం’’

Updated : 23 Jan 2022 05:24 IST

 అదే నేతాజీకి నిజమైన నివాళి

‘ఈటీవీ భారత్‌’తో సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు చంద్రకుమార్‌ బోస్‌

‘‘విభజన, మత రాజకీయాలను ఆపకపోతే 1947లో ఏం జరిగిందో అదే మళ్లీ పునరావృతమవుతుంది. అప్పట్లో నేతాజీ భారత్‌ తిరిగి వచ్చి ఉంటే దేశం, బెంగాల్‌ విడిపోయి ఉండేవి కావు. కాబట్టి దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే నేతాజీ భావజాలాన్ని పాటించటమొక్కటే మార్గం’’

-చంద్రకుమార్‌ బోస్‌

కోల్‌కతా: ఇండియా గేట్‌ వద్ద సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేతాజీ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ స్వాగతించారు. కేవలం విగ్రహం పెడితే సరిపోదని, నేతాజీ సిద్ధాంతాల్ని మనసా వాచా కర్మణా పాటించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని నొక్కిచెప్పారు. సర్వ మతాలను కలుపుకొనిపోయే సమ్మిళిత భావజాలాన్ని కేంద్రం, ప్రధానమంత్రి అనుసరించాలని సూచించారు. సామాజిక సమభావన సూత్రాన్ని నేతాజీ జీవితాంతం అనుసరించారని, ఆ సిద్ధాంతాల బాటలో దేశాన్ని నడిపించాల్సిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ‘ఈటీవీ భారత్‌’తో చంద్రకుమార్‌ బోస్‌ పేర్కొన్నారు. ‘‘మతాలను కలుపుకొనిపోయే ప్రక్రియను నేతాజీ నమ్మారు. ఆ సమ్మిళిత రాజకీయాల ఆధారంగానే ఆయన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌, ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని నడిపారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న విభజిత, మత రాజకీయాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాడాలంటే నేతాజీని ఉదాహరణగా తీసుకోవాలి’’ అని చంద్రకుమార్‌ స్పష్టం చేశారు. మత ఆధారిత రాజకీయాలను నేతాజీ ఎన్నడూ నమ్మలేదని తెలిపారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో ప్రముఖ కమాండర్‌ పేరు షా నవాజ్‌ ఖాన్‌ అని, జర్మనీ నుంచి నేతాజీ రహస్యంగా జలంతర్గామిలో జపాన్‌ ప్రయాణించిన సమయంలో ఆయనతో అబిద్‌ హసన్‌ అనే ముస్లిం వ్యక్తి ఉన్నారని గుర్తు చేశారు. మతాలు వేరైనా.. మనమంతా భారతీయులమన్న విషయాన్ని నేతాజీ దేశానికి చాటి చెప్పారని, దీన్ని దేశంలోని యువతకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరముందని అన్నారు. ‘‘ఈ దిశగా యువతరానికి ముందుకు నడిపించకపోతే దేశంలో మరో విభజన అనివార్యం. ఈ సమ్మిళిత రాజకీయాలను ప్రధానమంత్రి అనుసరించాలి. అదే నేతాజీకిచ్చే ఘన నివాళి’’ అని చెప్పారు. దీనిపై ప్రధానికి తాను లేఖ కూడా రాశానని బోస్‌ తెలిపారు. 2016 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చంద్రకుమార్‌ బోస్‌ భాజపా అభ్యర్థిగా పోటీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని