
ఫిబ్రవరి 5 లోగా దళితబంధు అర్హుల జాబితా
ఇప్పటికే విడుదలైన రూ.100 కోట్లు
రెండు మూడు రోజుల్లో మరో 1,100 కోట్లు కూడా
ఎస్సీల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఈనాడు, హైదరాబాద్, కరీంనగర్ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: స్థానిక శాసనసభ్యుల సలహాతో వచ్చే నెల 5లోగా దళితబంధు అర్హుల జాబితాను రూపొందించి, ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులతో ఆమోదం పొందాలని ఎస్సీల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మార్చి ఏడో తేదీ లోపు ఈ పథకానికి సంబంధించిన ఆస్తులను పంపిణీ చేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో అర్హుల ఎంపికకు ప్రత్యేక అధికారులను నియమించుకోవాలన్నారు. దళితబంధు పథకం అమలుపై కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తుండగా... మిగిలిన 118 నియోజకవర్గాల్లో వందేసి కుటుంబాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాలని ఇటీవలి మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీని కోసం రూ.1,200 కోట్లు కేటాయించి అందులో రూ.వంద కోట్లు ఇప్పటికే విడుదల చేశాం. రెండు మూడు రోజుల్లో మిగిలిన రూ.1,100 కోట్లు కలెక్టర్ల ఖాతాల్లో జమ చేస్తాం. లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి. ఒక్కో లబ్ధిదారుకు మంజూరైన రూ.10 లక్షల నుంచి రూ.10 వేలతో ప్రత్యేక దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలి’’ అని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అర్హుల ఎంపికపై ప్రత్యేక అధికారులకు స్పష్టమైన సూచనలు ముందే ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీల అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.