
TS News: ఇంటర్లో స్వల్పంగా ఛాయిస్ పెంపు!
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో గత ఏడాది కంటే మరికొంత ఛాయిస్ పెంచాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం మూడు సెక్షన్లలో గత విద్యా సంవత్సరమే రెండు సెక్షన్లలో భారీగా ఛాయిస్ పెంచిన సంగతి తెలిసిందే. వచ్చే వార్షిక పరీక్షలకు కూడా మరోసారి పెంచనున్నారు. గత ఏడాది వరకు సైన్స్ గ్రూపుల్లో 2 మార్కుల ప్రశ్నల్లో ఛాయిస్ ఇవ్వలేదు. ఈసారి ఆ సెక్షన్‌కూ వర్తింపజేయనున్నారు. ఇప్పటివరకు 10కి 10 జవాబులు రాయాల్సి ఉండగా వాటిని 15కు పెంచి 10కి జవాబులు రాసేలా ఛాయిస్ ఇస్తారు. ఆర్ట్స్ గ్రూపులో గతంలో 10 మార్కుల ప్రశ్నలు 6 ఇస్తే 3 రాయాలి. దాన్ని ఏడుకు పెంచుతారు. 5 మార్కుల ప్రశ్నలు 16కు ఎనిమిది రాయాలి. వాటిని 18కి పెంచుతారు. ఛాయిస్ పెంచినంత మాత్రానా విద్యార్థులకు పూర్తి ప్రయోజనం ఒనగూరదని గత ఇంటర్ ప్రథమ పరీక్షల ఫలితాలను బట్టి రుజువైంది. మే 2వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు జరపాలని బోర్డు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు చెల్లించే ఫీజు గడువును ఇంటర్‌బోర్డు పెంచింది. ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆలస్య రుసుం లేకుండా ఈనెల 24లోగా చెల్లించాలి. కళాశాలలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగించినందున ఫీజుగడువును ఫిబ్రవరి 4 వరకు పెంచారు. రూ.200 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 10, రూ.వెయ్యితో 17వ తేదీ, రూ.2 వేలతో ఫిబ్రవరి 24 వరకు చెల్లించవచ్చని కార్యదర్శి జలీల్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.