
పురుగు మందులు మరింత భారం
రూ.2,500 నుంచి రూ.2.50 లక్షలకు సాంకేతిక వివరాల రిజిస్ట్రేషన్ రుసుముల పెంపు
రాష్ట్ర వ్యవసాయశాఖకు ప్రతిపాదనలు పంపిన కేంద్రం
ఈనాడు,హైదరాబాద్ : దేశంలో పురుగు మందుల సాంకేతిక వివరాల(ఫార్ములేషన్, టెక్నికల్స్) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఛార్జీలు, దిగుమతి రేట్లు భారీగా పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖలకు పంపి వచ్చే నెల 4లోగా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. చైనా నుంచి విచ్చలవిడిగా దిగుమతి అవుతున్న నాసిరకం మందులను అరికట్టి, నాణ్యమైన వాటిని మాత్రమే తయారుచేసి రైతులకు విక్రయించేందుకు రుసుంలను పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ పెంపు వల్ల పురుగు మందులతో పాటు కలుపు మొక్కలను చంపే మందులు తయారుచేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై భారం పడనుంది. అంతిమంగా ఈ సొమ్మును రైతుల నుంచే కంపెనీలు వసూలు చేస్తాయి. సాధారణంగా దేశంలో ఎక్కడైనా ఏదైనా క్రిమిసంహారక మందు తయారీ యూనిట్ స్థాపించి, ఉత్పత్తిని చిల్లర మార్కెట్లో అమ్మాలంటే ముందుగా కేంద్ర ఇన్సెక్టిసైడ్ బోర్డులోని రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీఆర్‌సీ) వద్ద వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత యూనిట్ స్థాపించే రాష్ట్రంలోని వ్యవసాయశాఖ నుంచి ఉత్పత్తిదారుల లైసెన్సు తీసుకోవాలి. ఒక్కో యూనిట్లో సాధారణంగా 50 నుంచి 100 రకాల మందులు తయారుచేస్తారు.
గతంలో రూ.5వేలు.. ఇప్పుడు రూ.4.5 లక్షలు
* ఒక్కో మందు రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతం రూ.2,500 చొప్పున రుసుం ఉంది. దీనిని రూ.2.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.
* ఒక క్రిమిసంహారక మందు ఫార్ములేషన్లు, సాంకేతిక సమాచారాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకోవాలంటే గతంలో ఒక్కోదానికి రూ.5 వేలు రుసుం చెల్లించేవారు. దానిని రూ.4.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ స్థాయిలో ధరలు పెంచితే చిన్న, మధ్య తరహా క్రిమిసంహారక మందుల తయారీ పరిశ్రమలు మనుగడ సాగించలేవని వాటి యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
* ప్రస్తుతం ఇక మందు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలంటే రుసుం రూ.100 ఉంది. ఇప్పుడు రూ.5 వేలకు పెంచనున్నారు. ఈ ధరల పెంపుతో క్రిమిసంహారక మందుల తయారీ రంగంలో బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యం పెరిగిపోతుందని, తమ కంపెనీలు మూతపడతాయని చిన్న సంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆ తరవాత పెద్ద సంస్థలు పురుగుమందుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతాయంటున్నాయి.
* ప్రస్తుతం ప్రపంచంలో అతి తక్కువ ధరల్లో క్రిమిసంహారక మందులు తయారు చేసి విక్రయించేది భారత్‌లోని చిన్న, మధ్య తరహా కంపెనీలేనని వాటి యాజమాన్యాలంటున్నాయి. సాధారణంగా పురుగు మందుల తయారీ యూనిట్ స్థాపించాలంటే సొంత భూమి ఉంటే రూ.కోటి పెట్టుబడి సరిపోయేది. ఇప్పుడు కేంద్ర ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అది కాస్తా రూ.4 కోట్లకు చేరనుందని, వీటిని వ్యతిరేకించాలని చిన్న కంపెనీల యాజమాన్యాలు రాష్ట్ర వ్యవసాయశాఖను కోరాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.