
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా శ్రీరామనగరం
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
శంషాబాద్, న్యూస్‌టుడే: దేశంలోనే శ్రీరామనగరం ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. శనివారం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ సీఎం, కుటుంబ సభ్యులకు పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రాంగణంలో 50 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తులో రూపొందించిన పంచలోహ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని వారు సందర్శించారు. వచ్చే నెల 2 నుంచి 14 వరకు 200 ఎకరాల విస్తీర్ణంలో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకల ఏర్పాట్లను చౌహాన్ పరిశీలించారు. కుటీరంలో చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకొన్నారు. చౌహాన్‌కు సహస్రాబ్ది ఉత్సవాల ఆహ్వాన పత్రికను చినజీయర్ స్వామి అందజేశారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవలందిస్తున్న ఘనత జీయర్ ట్రస్ట్‌కే దక్కిందని మధ్యప్రదేశ్ సీఎం అన్నారు. జీవితమే లేదనుకున్న పేద కుటుంబాలకు చెందిన అంధులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.