మరో రెండు పారిశ్రామిక నడవాలు

తెలంగాణ ప్రభుత్వం మరో రెండు కొత్త పారిశ్రామిక నడవా(కారిడార్‌)ల ఏర్పాటుకు నిర్ణయించింది. హైదరాబాద్‌- విజయవాడ(277కిలోమీటర్లు), హైదరాబాద్‌- బెంగళూరు(575 కిలోమీటర్లు) మార్గంలో వీటిని ప్రతిపాదించింది.

Published : 24 Jan 2022 05:02 IST

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
వీటికి నిధులు కేటాయించండి  
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో రెండు కొత్త పారిశ్రామిక నడవా(కారిడార్‌)ల ఏర్పాటుకు నిర్ణయించింది. హైదరాబాద్‌- విజయవాడ(277కిలోమీటర్లు), హైదరాబాద్‌- బెంగళూరు(575 కిలోమీటర్లు) మార్గంలో వీటిని ప్రతిపాదించింది.

ఇప్పటికే హైదరాబాద్‌- వరంగల్‌, హైదరాబాద్‌- నాగ్‌పుర్‌ నడవాలను ప్రతిపాదించిన తెలంగాణ నలువైపులా నడవాల కోసం కొత్తగా విజయవాడ, బెంగళూరు మార్గాలను ఎంచుకుంది.. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో కొత్త నడవాలు ఒక్కోదానికి రూ.1500 కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక ప్రాజెక్టులు ఔషధనగరి, జహీరాబాద్‌ నిమ్జ్‌, నేషన్‌ డిజైన్‌ సెంటర్‌ల వ్యవస్థాపక, మౌలిక వసతులకు సైతం నిధులు కేటాయించాలన్నారు. జాతీయ రక్షణ పారిశ్రామిక ఉత్పత్తుల నడవాలో హైదరాబాద్‌ను చేర్చాలన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ఆదివారం ఆమెకు లేఖ రాశారు.

అందులోని ముఖ్యాంశాలు..

‘‘పారిశ్రామిక నడవాలు ప్రగతికి దోహదపడతాయి. వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి హైదరాబాద్‌- వరంగల్‌,  హైదరాబాద్‌- నాగ్‌పుర్‌ నడవాలను ప్రతిపాదించాం. వీటికి రూ.ఆరు వేల కోట్లు కావాలి. హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ కారిడార్‌లో మంచిర్యాల మార్గాన్ని కొత్తగా చేర్చాలి. హైదరాబాద్‌- బెంగళూరు, హైదరాబాద్‌- విజయవాడ నడవాలను జాతీయ పారిశ్రామిక నడవాల కార్యక్రమంలో చేపడతాం. హుజూరాబాద్‌, జడ్చర్ల- గద్వాల్‌- కొత్తకోట రహదారులను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తాం. వీటికి రూ.మూడు వేల కోట్లు ఇవ్వాలి.

ఔషధ రంగంలో అద్భుత ప్రగతి

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ] పరిశ్రమల సమూహం ఔషధనగరి. ఈ రంగంలో అద్భుతమైన ప్రగతికి కేంద్రంగా హైదరాబాద్‌ మారుతోంది. ఇప్పటికే దీనికి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్‌) హోదాను ఇవ్వడంతో పాటు జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.64వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 5.6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్టు బృహత్తర ప్రణాళిక కోసం రూ.50 కోట్లు, రోడ్ల అనుసంధానం, నీటి, విద్యుత్‌ సరఫరా, రైల్వే అనుసంధానం, మౌలిక వసతుల కోసం రూ.1399 కోట్లు, వ్యర్థాల శుద్ధి కేంద్రానికి రూ.3554 కోట్లు మొత్తంగా ఔషధనగరికి రూ.5003 కోట్లు ఇవ్వాలి.  తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువు. ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రెండు జాతీయ నడవాల పరిధిలో హైదరాబాద్‌ను చేర్చాలి. జహీరాబాద్‌ నిమ్జ్‌లో వైమానిక సమూహాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం.

జాతీయ ఆకృతి కేంద్రానికి..

మీ సూచన మేరకు జాతీయ ఆకృతి కేంద్రాన్ని(ఎన్డీసీని) హైదరాబాద్‌లోని జాతీయ నిర్మాణ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. దీనికి 8 సంవత్సరాల పాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చు ఇవ్వాలి. ప్రాజెక్టు వ్యయంలో 25శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


నోవార్టిస్‌ భారీ సామర్థ్య కేంద్రం ఎక్కడుంది?
నెటిజన్లకు ట్విటర్‌లో కేటీఆర్‌ ప్రశ్న

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నోవార్టిస్‌కు ప్రపంచంలోనే భారీదైన సామర్థ్య కేంద్రం ఎక్కడుందో తెలుసా? అని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో ప్రశ్నించారు. ఆ సంస్థకు అతిపెద్ద డేటా సైన్స్‌, అనలిటిక్స్‌, ఔషధ అభివృద్ధి, సాంకేతిక, ఆర్థిక కార్యకలాపాల కేంద్రం ఎక్కడ నడుస్తోంది? అని ఆయన అడుగుతూ.. హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీలోని నోవార్టిస్‌ భవన సముదాయం ఫొటోలను ట్వీట్‌కు జత చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి కేంద్రాలపై ఆయన నెటిజన్లను ట్విటర్‌ ద్వారా ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని