Published : 24 Jan 2022 05:03 IST

రుణమో రామచంద్రా

 పరిశ్రమలకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకుల అనాసక్తి  
 రెండేళ్లుగా 30 శాతం మేరకు తగ్గిన సాయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని కరోనా తీవ్రంగా దెబ్బ తీయగా.. బ్యాంకుల నుంచి సాయం అందడం లేదు. కొత్త రుణాల్లేకపోగా, పాత బకాయిల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా బ్యాంకులు 30 శాతానికి పైగా రుణసాయాన్ని తగ్గించాయి. మంజూరైన వాటికీ మొండిచేయి చూపుతున్నాయి. రుణ లక్ష్యాలను సాధించడం లేదు. గతంలోలా రుణామేళాలూ లేవు.

ఆపత్కాలంలో అందని ఆసరా

కరోనా సంక్షోభంతో చాలా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి. వీటిపై అపనమ్మకంతో బ్యాంకులు సాయం చేయడానికి వెనుకాడుతున్నాయి. గతంలో భూముల తనఖాపై అప్పులు ఇచ్చేవి. 2020 నుంచి భూములు చూపినా రుణాలివ్వడం లేదు. పారిశ్రామిక ఆస్తులనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇళ్లు, ఇతర విలువైన ఆస్తులను మాత్రమే పూచీకత్తుగా అంగీకరిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏటా 20 శాతం, సూక్ష్మ పరిశ్రమలకు 10 శాతం రుణాలు పెంచాల్సి ఉంది. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో అవి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 39,351 కోట్లకు గాను, రూ. 21,426 కోట్లు మాత్రమే రుణాలిచ్చాయి. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల వరకు రుణసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ ట్రస్టు ఫర్‌ మైక్రో, స్మాల్‌ ఇండస్ట్రీస్‌ (సీజీటీఎంఎస్‌ఈ) పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద 2020-21లో 1449 మందికి మాత్రమే రూ. 185 కోట్ల సాయం మంజూరైంది. అదీ విడుదల కావాల్సి ఉంది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమూహాల (క్లస్టర్ల)కు రుణ సాయం చేసేందుకు కేంద్రం నిర్దేశించింది. తెలంగాణలో 5,169 సమూహాలుండగా. అందులో 3,861 సమూహాల్లోని పరిశ్రమలకు మాత్రమే కొద్దిపాటి రుణసాయం అందింది.

కరోనా కాలంలో రుణ వాయిదాలను చెల్లించని 1,57,034 పరిశ్రమలను బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. దాదాపు రూ.7,184 కోట్ల మేర బకాయిలున్న వీటి జప్తునకు సన్నాహాలు జరుగుతున్నాయని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ చిన్నతరహా పారిశ్రామికవేత్త.. కరోనాతో పరిశ్రమ నిర్వహణ కష్టంగా మారడంతో... రుణసాయం కోసం బ్యాంకులను సంప్రదించారు. పాత బకాయిలు చెల్లిస్తేనే అప్పు ఇస్తామని బ్యాంకు తిరస్కరించింది.

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త బీటెక్‌ పూర్తి చేసి కొత్తగా విద్యుత్తు పరికరాల తయారీ పరిశ్రమ స్థాపించాలని బ్యాంకు అధికారులను కలిశారు. రూ. 2 కోట్ల వరకు పూచీకత్తు లేకుండా సాయం అందించాల్సి ఉన్నా, రుణమివ్వడానికి బ్యాంకు ముందుకు రాలేదు.

* కేంద్రప్రభుత్వం తెచ్చిన అత్యవసర పరపతి పూచీ పథకం కింద 2,16,267 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా.. 87,516 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి.


* కొవిడ్‌ కాలంలో దెబ్బతిన్న పరిశ్రమల ఖాతాల పునరుద్ధరణకు కేంద్రం ఆదేశించింది. దీని కింద 2,17,891 పరిశ్రమలను గుర్తించగా, 43,364 ఖాతాలను మాత్రమే బ్యాంకులు పునరుద్ధరించాయి.


* సంక్షోభంలో ఉన్న పరిశ్రమల కోసం సీజీఎస్‌ఎస్‌డీ పథకాన్ని కేంద్రం చేపట్టగా.. 562 పరిశ్రమలకు రూ.73 లక్షలు మాత్రమే రుణంగా అందింది.


* యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త జౌళి పరిశ్రమ నడుపుతున్నారు. పదేళ్ల కిందట బ్యాంకు రుణం తీసుకొని.. ఎనిమిదేళ్లు బకాయిలు చెల్లించారు. కరోనా వల్ల కిస్తీలు కట్టలేకపోయారు.బ్యాంకు ఆదుకోకపోగా, ఆయన పరిశ్రమను బ్యాంకు నిరర్ధక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించింది.


బ్యాంకుల వైఖరి దారుణం
- కె. సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు  

కరోనా సమయంలో బ్యాంకుల వైఖరి దారుణంగా ఉంది. చిన్నపరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాల్సి ఉన్నా, బ్యాంకులు చిన్నచూపు చూస్తున్నాయి. ఏటా పదేసి శాతం రుణసాయం పెంచాల్సి ఉండగా.. ఉద్దేశపూర్వకంగా లక్ష్యాలను కుదించి, సాయం తగ్గిస్తున్నాయి. సీజీటీఎంఎస్‌ఈ వంటి పథకాలను పట్టించుకోవడం లేదు. రుణ వసూళ్లు వాయిదా వేయాలని, వడ్డీ తగ్గించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోలేదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఏ సాయమూ అందలేదు.


మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదరణ సున్నా
- శ్రీలక్ష్మివాణి; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు

మహిళలు ఉపాధి కోసం, ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొస్తున్నా.. బ్యాంకులు వారిని ప్రోత్సహించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఎంపికైనా బ్యాంకులు తమ వాటాగా రుణాలివ్వడానికి మొరాయిస్తున్నాయి. గత రెండేళ్లలో వేల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. కొంతమందికి మంజూరైనా విడుదల చేయడం లేదు. కరోనా కారణంగా ఎక్కువగా దెబ్బతిన్నది మహిళా పారిశ్రామికవేత్తలే. వారి ఖాతాలను వెంటనే నిరర్ధక ఆస్తులుగా మార్చడానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి తప్ప ఆదుకోకపోవడం బాధాకరం. బ్యాంకుల ధోరణి మారితేనే పారిశ్రామికరంగం కుదుటపడుతుంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని