కేంద్ర శాఖల్లో పోస్టులు భర్తీ చేయరా?

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ నియామకాలు చేపడతామన్న భాజపా.. ఈ ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.  సైన్యంలో 3 లక్షలు, రైల్వేలో

Published : 24 Jan 2022 04:13 IST

మొత్తం 15.62 లక్షల ఖాళీలున్నాయ్‌
దళితబంధును దేశ వ్యాప్తంగా అమలు చేయండి: హరీశ్‌రావు

ఈటీవీ, సంగారెడ్డి: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగ నియామకాలు చేపడతామన్న భాజపా.. ఈ ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.  సైన్యంలో 3 లక్షలు, రైల్వేలో 3 లక్షలు.. కలిపి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15,62,000 ఖాళీలు ఉన్నా.. వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. దళితబంధు పథకం కార్యాచరణపై సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారుల కోసం ఇప్పటికే కలెక్టర్ల బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేశామన్నారు. మార్చి మొదటి వారంలోపు యూనిట్లు ఏర్పాటవుతాయని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో ఈ పథకం కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామని చెప్పారు. కేంద్రం దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ప్రయత్నించకుండా.. భాజపా ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.  

‘‘బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వే, ఎయిర్‌ ఇండియా వంటి సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తోంది. మేము నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఆర్థిక సాయం అందించి కాపాడుకుంటున్నాం. కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి, రాష్ట్రంలో తెరాస సర్కారుకు ఉన్న తేడా ఇదే’’ అని హరీశ్‌రావు అన్నారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు, నిధులు కేటాయించకుండా కేంద్రం మొండి చేయి చూపుతోంది. సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినా కనీస స్పందన లేదు’’ అని అన్నారు.


విద్యకు అత్యంత ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం దైనందినులను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని