Published : 25 Jan 2022 05:46 IST

రాష్ట్ర సహకారం లేకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం

రాష్ట్ర ప్రభుత్వ వాటా.. భూమి కేటాయింపులు పూర్తి చేయండి

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తమ వాటా నిధులు విడుదల చేయకపోవడం.... భూ కేటాయింపులు పూర్తి చేయకపోవడంవల్లే తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయడం లేదని ఇటీవల తెరాస నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోపణలకు ముందు ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వ్యయాన్ని, చేయాల్సిన భూ కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ‘‘ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు నిధుల కేటాయింపు కొన్ని రెట్లు పెరిగింది. 2014-15 బడ్జెట్‌లో రూ.250 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2021-22 నాటికి రూ.2,420 కోట్లకు పెరిగాయి.  ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చొరవ చూపి తక్షణమే సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను’’ అని పేర్కొంటూ కిషన్‌రెడ్డి ఆయా ప్రాజెక్టుల్లోని సమస్యలను లేఖలో వివరించారు.

* మనోహరాబాద్‌-కొత్తపల్లి నూతన రైలు మార్గం (151 కి.మీ.) నిర్మాణ వ్యయంలో ఇప్పటికీ రూ.100 కోట్ల బకాయి ఉంది. 342 హెక్టార్ల భూమిని రైల్వేకు అప్పగించాలి.
* అక్కన్నపేట-మెదక్‌ నూతన రైలు మార్గానికి  2021-22 ఏడాదికిగాను రాష్ట్రం రూ.31 కోట్లను చెల్లించడంతో పాటు 1.02 హెక్టార్ల భూమిని అప్పగించాలి.  
* ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 ప్రాజెక్ట్‌కు కేంద్ర ఇప్పటివరకు రూ.835 కోట్లు వ్యయం చేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.129 కోట్లు మాత్రమే జమ చేసింది. అంచనావ్యయం పెరిగిన మేరకు  తన వాటాగా రూ.760 కోట్లు జమ చేయాల్సి ఉంది.
* రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2ను యాదాద్రి వరకు (33 కి.మీ.) పొడిగించేందుకు రైల్వే బోర్డు అనుమతించింది. రాష్ట్రం నిధులు జమ చేయనందున ప్రాజెక్ట్‌ ఇంకా ప్రారంభంకాలేదు.
* భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి నూతన మార్గం (53.2 కి.మీ.) పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2021, జులై నాటికే దీనిని ప్రారంభించాలనుకున్నా ఎలక్టిక్ర్‌ హైటెన్షన్‌ క్రాసింగ్‌లు, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలకు సంబంధించిన భూ సమస్యలతో జాప్యం చోటుచేసుకుంది.
* కేంద్రమే పూర్తి నిధులిచ్చిన ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో చొరవ చూపకపోవడంతో ఆలస్యమవుతున్నాయి.  ఉదా।। కాజీపేట-బలార్షా మూడో మార్గం,  కాజీపేట-విజయవాడ మూడో మార్గం.
* కాజీపేట-హసన్‌పర్తి రోడ్‌ స్టేషన్ల మధ్య బైపాస్‌ లైన్‌, మూడో మార్గం పనులకు (11.06 కి.మీ.) 7.8 హెక్టార్ల భూమి అప్పగించాలని  కోరి అందుకయ్యే వ్యయాన్ని జమ చేసినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదు.
* మణుగూరు-రామగుండం, కొండపల్లి-కొత్తగూడెం మార్గాల నిర్మాణాల్లో వ్యయ భాగస్వామ్యానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రాజెక్టుల్లో వాటా నిర్ధారణకు తెలంగాణ ప్రభుత్వానికి అనేక అభ్యర్థనలు పంపినా ఏ స్పందనా లేదు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా-వికారాబాద్‌, కరీంనగర్‌-హసన్‌పర్తి, బోధన్‌-లాతూర్‌ రోడ్డు నూతన మార్గాల నిర్మాణానికి ఇప్పటికే సర్వే పూర్తయినా వ్యయ భాగస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించకపోవడంతో మంజూరు ఆగిపోయింది.
* చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను కొత్త శాటిలైట్‌ టెర్మినల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అయితే స్టేషన్‌ చేరుకోవడానికి  రోడ్డు సౌకర్యం కల్పిస్తే ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించడానికి వీలవుతుంది.
* రాష్ట్రానికి మొత్తం 54 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు మంజూరయ్యాయి. అనేక అంశాలపై రాష్ట్ర అధికారుల నుంచి సహకారం అందడం లేదు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని