Cyber Crime: సర్వర్లో చొరబడి.. దోపిడీకి తెగబడి..

హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుపై సైబర్‌ నేరగాళ్లు పంజా విసిరారు. బంజారాహిల్స్‌లోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలోని సర్వర్‌లోకి చొరబడి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును కొట్టేశారు.

Updated : 25 Jan 2022 06:14 IST

ఏపీ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుపై సైబర్‌ పంజా

గంటల వ్యవధిలో రూ.12.90 కోట్లు స్వాహా

వేగంగా స్పందించిన పోలీసులు

బదిలీ కాకుండా రూ.2.50 కోట్ల నిలిపివేత

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుపై సైబర్‌ నేరగాళ్లు పంజా విసిరారు. బంజారాహిల్స్‌లోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలోని సర్వర్‌లోకి చొరబడి గంటల వ్యవధిలో రూ.12.90 కోట్ల నగదును కొట్టేశారు. ముగ్గురి ఖాతాల్లోకి ఆ నగదును బదిలీచేసి.. అక్కడి నుంచి దిల్లీ, బిహార్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్వేరు జాతీయ, కార్పొరేట్‌ బ్యాంకుల్లోని 128 ఖాతాలకు జమ చేశారు.

నగదు నిల్వలు తగ్గినట్లు గుర్తించిన మహేశ్‌ బ్యాంకు ప్రతినిధులు ఆదివారం రాత్రి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వేగంగా స్పందించి ఫిర్యాదు నమోదు చేసి కార్పొరేటు, జాతీయ బ్యాంకుల ఐటీ విభాగాలను అప్రమత్తం చేశారు. రూ.2.50కోట్ల నగదును విత్‌డ్రా చేసుకోకుండా స్తంభింపజేశారు. నేరశైలిని బట్టి నైజీరియన్లే ఈ పని చేసుంటారని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ 16గంటల్లో నేరస్థులు ఇదంతా చేశారని ప్రాథమిక సమాచారం సేకరించారు.

ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి..

నగదు నిల్వలు తగ్గినట్లు ఏపీ మహేశ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు ఆదివారం రాత్రి పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా రాత్రి 11 గంటలకు ఎస్సై మదన్‌  ఠాణాకు చేరుకున్నారు. బ్యాంకు వివరాలన్నీ సేకరించి రాత్రి వేళల్లోనూ పనిచేస్తున్న వేర్వేరు ఐటీ విభాగాలకు సమాచారం పంపి నగదు నిల్వలను స్తంభింపజేయాలని కోరారు. రూ.12.90 కోట్లు వెళ్లిన బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించి హైదరాబాద్‌ నుంచి అక్కడికి వెళ్లిన బ్యాంక్‌ ఖాతాల ఐపీ చిరునామాల ఆధారంగా ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి నగదు బదిలీ ఆపాలంటూ కోరారు. రూ.2.50కోట్లు విత్‌డ్రా కాకుండా ఆపారు.

పక్కా ప్రణాళికతో..

బ్యాంక్‌లో నగదు కొల్లగొట్టింది ఒక్కడేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు. నేరస్థుడు బ్యాంక్‌ సర్వర్‌లోకి ప్రవేశించి హ్యాక్‌ చేయడం ద్వారా రూ.12.90 కోట్లు స్వాహా చేసేంతవరకూ పక్కా ప్రణాళికతో వ్యవహరించాడని తెలుసుకున్నారు. నాలుగో శనివారం, ఆదివారం బ్యాంక్‌కు సెలవు కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోరన్న అంచనాతో శనివారాన్ని ఎంచుకున్నాడని గుర్తించారు. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, పొదుపు, కరెంట్‌ ఖాతాల వివరాలు, నగదు బదిలీకి అవసరమైన సాంకేతికతను సమకూర్చుకున్నాడని తేల్చారు. 

గరిష్ఠ పరిమితిని రూ.50 కోట్లకు మార్చేసి..

బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌లో కొన్ని అంశాలను సైబర్‌ నేరస్థుడు తెలుసుకున్నాడు. డబ్బు కొట్టేసేందుకు  వ్యవస్థలను ఇష్టారాజ్యంగా మార్చుకున్నాడు.

* మహేశ్‌  బ్యాంక్‌ ఖాతాదారుల్లో ముగ్గురిని సైబర్‌ నేరస్థుడు ఎంచుకున్నాడు. వీరిలో ఒకరు మహిళ. ఆమెది సేవింగ్స్‌ ఖాతా కాగా మరో ఇద్దరికి కరెంట్‌ ఖాతాలున్నాయి. ముందుగా ఈ ముగ్గురి ఖాతాల్లోకి ప్రధాన సర్వర్‌లోంచి రూ.12.90 కోట్ల బదిలీకినెట్‌ బ్యాంకింగ్‌ గరిష్ఠ పరిమితిని రూ.50 కోట్ల వరకు మార్చేశాడు.
* ముగ్గురి ఖాతాల్లోకి నగదు జమకాగానే సంక్షిప్త సందేశాల వ్యవస్థలోకీ చొరబడి వారినంబర్లను మార్చేశాడు.
* అనుకున్న మొత్తాన్ని మూడు ఖాతాల్లోకి జమ చేసుకున్నాక. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రోజుకు జరిపే లావాదేవీల సంఖ్యను మార్చేశాడు. అనంతరం మూడు ఖాతాల్లోంచి దిల్లీ, ఝార్ఖండ్‌, బిహార్‌, అస్సాం, మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లోని వేర్వేరు బ్యాంకుల్లోని ఖాతాలకు రూ.12.90 కోట్ల నగదును జమ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని