ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు!

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తోంది. దీనికి సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Published : 25 Jan 2022 04:31 IST

ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌?

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తోంది. దీనికి సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం దీనికి ప్రతిబంధకంగా మారనుంది. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. జనాభా లెక్కల సేకరణ 2021 మే నాటికి పూర్తి కావలసి ఉండగా కొవిడ్‌ వల్ల వాయిదా పడింది. అది ఎప్పటికి పూర్తవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనను అధిగమించి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎలా ముందుకు వెళుతుంది? ఏమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోందా? అన్న విషయంలో స్పష్టత రావలసి ఉంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. అయితే అరకు లోక్‌సభ నియోజకవర్గం భౌగోళికంగా చాలా విస్తారమైనది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా చేయాలన్న ఆలోచన ఉంది. ఆ ప్రకారం రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాల్ని... 26 జిల్లాలుగా చేయాలన్నది ప్రతిపాదన. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేసే క్రమంలో... కొన్నిచోట్ల ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న నగరంలో కొంత భాగం కొత్తగా ఏర్పడే జిల్లాల్లోకి వెళ్లనుంది. అంటే ఒక నగరం లేదా, పట్టణంలోని కొంత భాగం ఒక జిల్లాలోను, మరికొంత భాగం మరో జిల్లా పరిధిలోను ఉంటుంది. ఇలాంటి సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారన్న విషయంలోనూ స్పష్టత రావలసి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని