
మోగిన ఉద్యోగుల సమ్మెసైరన్
ఏపీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి
ఫిబ్రవరి 6 అర్ధరాత్రి ప్రారంభం
ఈనాడు, అమరావతి: వేతన సవరణ కమిషన్‌తో పాటు మరో ఐదు అంశాలపై పీఆర్సీ సాధన సమితి సోమవారం ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. పీఆర్సీ, అనుబంధ అంశాలు, సీపీఎస్ రద్దు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు, ఒప్పంద, ఎన్ఎంఆర్, రోజువారీ వేతన ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగు సేవల ఉద్యోగులకు వేతనాల పెంపు డిమాండ్లను నోటీసులో ప్రస్తావించింది. ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి (తెల్లవారితే 7వ తారీఖు) ఉద్యోగులు అందరూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. పీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చాక ఉద్యోగ సంఘాల్లో అపోహలు తొలగించేందుకంటూ మంత్రుల కమిటీ వేయడం ఏంటని ప్రశ్నించింది. పీఆర్సీ ఉత్తర్వులు నిలిపివేత, జనవరి నెలకు పాత వేతనాలు, అశుతోష్‌మిశ్ర నివేదిక ఇస్తామని హామీ లభిస్తేనే కమిటీతో చర్చలకు వెళ్తామని ప్రకటించింది. సమ్మెకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘాలు కార్మిక చట్టం నిబంధనల మేరకు శశిభూషణ్‌కు ప్రత్యేకంగా సమ్మె నోటీసు ఇచ్చాయి. ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి.
* మరోపక్క, ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు, సంఘాలతో సంప్రదింపులు జరిపేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని వెంకట్రామయ్య, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులు కాగా, సీఎస్ సమీర్‌శర్మ సభ్య-కన్వీనర్‌గా ఉంటారు.