Updated : 25 Jan 2022 05:35 IST

వయసులో చిన్న..ప్రత్యేకతలో మిన్న

‘యంగ్‌ అచీవర్స్‌’గా రాష్ట్రం నుంచి నలుగురు బాలికల ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల, కళాశాల స్థాయిలోనే ఆ అమ్మాయిలు విశేష ప్రతిభ చాటారు. రాష్ట్రం నుంచి నేడు దేశం గుర్తించే స్థాయికి ఎదిగారు. ఓ బాలిక తన కథల ద్వారా సామాజిక సమస్యలకు అద్దంపట్టగా.. మరొకరు సహజ ఉత్పత్తులతో స్త్రీలకు, పర్యావరణానికి మేలు చేసే శానిటరీ ప్యాడ్లను ఆవిష్కరించారు. ఇంకో బాలిక సైబర్‌ భద్రతపై తన చుట్టుపక్కల వారికి అవగాహన కల్పిస్తుండగా... మరో విద్యార్థిని ఉన్నత చదువుకు పేదరికం, సౌకర్యాలలేమి అడ్డుకావని నిరూపించారు. వారి కృషికి గుర్తింపుగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది యువ సాధకులు(యంగ్‌ అచీవర్స్‌)గా ఎంపిక చేసింది. ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రానికి చెందిన ఈ నలుగురితో పాటు దేశవ్యాప్తంగా 75 మంది విద్యార్థినులను యంగ్‌ అచీవర్స్‌గా కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. సోమవారం కేంద్ర అధికారులు వారితో ఆన్‌లైన్‌లో మాట్లాడి ఈ విషయాన్ని తెలిపి ప్రశంసించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన విజేతలకు అభినందనలు తెలిపారు.


6వ తరగతి నుంచే కథల రచన

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం కూర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి.శ్రీజ ఆరో తరగతి నుంచి సామాజిక ఇతివృత్తాలతో చిన్న చిన్న కథలు రాస్తోంది. ఆమె రాసిన 20 కథలను ‘శ్రీజ కథలు’ పేరిట సంకలనంగా ప్రచురించారు. కరోనా కాలంలో వలస కార్మికులపై బాలిక రాసిన కథ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ బహుమతి గెలుచుకుంది. మంచి రచయిత కావాలనేది తన లక్ష్యమని శ్రీజ తెలిపింది.


కస్తూర్బా నుంచి ఇంజినీరింగ్‌కు..

పేద కుటుంబానికి చెందిన కె.సోను అయిదో తరగతిలో ఉన్నప్పుడే తల్లి మృతి చెందింది. అనంతరం దేవరకొండ కేజీబీవీలో చేరి ఆరో తరగతి, ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకల్‌ కేజీబీవీలో చదివి ఇంటర్‌ పూర్తిచేసింది. గత ఏడాది కరోనా కారణంగా ఆన్‌లైన్‌ చదువులే అయినా అకుంఠిత దీక్షతో చదివి ఈ విద్యా సంవత్సరం ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌లో సీటు సాధించింది. హాస్టల్‌ వార్డెన్‌, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి, జువాలజీ అధ్యాపకురాలిని సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఆంగ్లంలోనూ పట్టు సాధిస్తోంది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధించి తన తండ్రిని బాగా చూసుకుంటానని చెబుతోంది ఈ విద్యార్థిని.


స్త్రీ రక్ష ప్యాడ్ల స్పష్టికర్త...

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ధీరావత్‌ అనిత.. ‘స్త్రీ రక్ష ప్యాడ్‌’ పేరిట భూమిలో ఇట్టే కలిసిపోయే శానిటరీ ప్యాడ్లను రూపొందించింది. పర్యావరణానికి హానిచేసే రసాయనాలు వాడకుండా.. సహజ సిద్ధమైన వేపాకులు, సబ్జా విత్తనాలు, మెంతులు, పసుపు తదితర వాటితో శానిటరీ ప్యాడ్లు తయారు చేసింది. ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వ ‘స్కూల్‌ ఇన్నోవేషన్‌’ పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. తన సొంతూరు దేవోజీనాయక్‌ తండాలో మహిళలు ఇప్పటికీ రుతుక్రమం సమయంలో సాధారణ దుస్తులను వాడుతూ అనారోగ్యం బారిన పడుతున్నారని గమనించి వీటిని తయారు చేసినట్లు అనిత తెలిపింది.


సైబర్‌ భద్రత ప్రచారకర్త...

హైదరాబాద్‌ గన్‌ఫౌండ్రీలోని జీజీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న కషిష్‌సింగ్‌..  తెలంగాణ పోలీసు, విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహించే సైబర్‌ కాంగ్రెస్‌లో శిక్షణ పొందింది. అనంతరం సైబర్‌ సెక్యూరిటీపై తన పాఠశాలలో, పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ తోటి విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.


శభాష్‌.. విరాట్‌!

హైదరాబాద్‌ చిన్నారికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం
ఏడేళ్ల వయసులో కిలిమంజారో అధిరోహించినందుకు అవార్డు
సోమవారం వర్చువల్‌ మీటింగ్‌లో ప్రశంసించిన ప్రధాని

ఏడేళ్లు కూడా నిండకుండానే ఆఫ్రికాలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు.. తల్లిదండ్రులకే కాకుండా... పుట్టిపెరుగుతున్న తెలంగాణకూ గర్వకారణంగా నిలిచాడు. ఇప్పుడు  ఎనిమిదేళ్ల వయసులో దేశ ప్రధానితో ‘శభాష్‌’ అని మెప్పు పొంది తన తోటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు.

అతి పిన్న వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినందుకు హైదరాబాద్‌కు చెందిన తేలుకుంట విరాట్‌చంద్ర(8)ను కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం-2022’కు ఎంపిక చేసింది. క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం, వినూత్న ఆవిష్కరణ తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచే 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేస్తోంది. దేశవ్యాప్తంగా 29 మంది ఈ అవార్డుకు ఎంపికవగా తెలంగాణ నుంచి విరాట్‌ ఒక్కడే ఉన్నాడు. విరాట్‌చంద్ర స్వస్థలం హైదరాబాద్‌లోని తిరుమలగిరి. ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. గతేడాది మార్చి 6న ఈ చిన్నారి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దాటుకుని 5,895 మీటర్ల ఎత్తులోని శిఖరం అంచుకు చేరుకున్నాడు. ఇందుకోసం విరాట్‌ 75 రోజుల పాటు కఠిన శిక్షణ పొందాడు. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. విరాట్‌ తండ్రి శరత్‌చంద్ర వ్యాపారవేత్త, తల్లి మాధవి గృహిణి. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ఎంపికైన చిన్నారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ నుంచి సమావేశంలో పాల్గొన్న విరాట్‌చంద్రను ప్రధాని అభినందించినట్లు అధికారులు తెలిపారు.  అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు రూ.లక్ష నగదు బహుమతిగా ఇస్తారు.


భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తానని.. ఇంజినీర్‌ కావాలన్నది తన లక్ష్యమని విరాట్‌చంద్ర ‘ఈనాడు’తో చెప్పాడు. తన కుమారుడికి జాతీయ పురస్కారం దక్కడంపై తండ్రి శరత్‌చంద్ర హర్షం వ్యక్తం చేశారు.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని