నూటికి నూరు శాతం టీకాస్త్రం.. కరీంనగర్‌ ఆదర్శం

కరోనా.. తొలిసారి కలవరపెట్టిన నగరం కరీంనగర్‌. రెండేళ్ల కిందట ఇండోనేసియన్లతో మొదలైన వైరస్‌ అలజడితో అట్టుడికిన ప్రాంతమిది. అలాంటి జిల్లా అర్హులైన పౌరులకు విజయవంతంగా టీకా రెండు డోసులనూ నూటికి నూరు శాతం అందించి నేడు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నిలిచింది.

Updated : 26 Jan 2022 03:45 IST

రాష్ట్రంలో రెండు డోసులనూ పూర్తిచేసిన తొలి జిల్లాగా ఖ్యాతి
నేడు అధికారికంగా ప్రకటించనున్న మంత్రులు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: కరోనా.. తొలిసారి కలవరపెట్టిన నగరం కరీంనగర్‌. రెండేళ్ల కిందట ఇండోనేసియన్లతో మొదలైన వైరస్‌ అలజడితో అట్టుడికిన ప్రాంతమిది. అలాంటి జిల్లా అర్హులైన పౌరులకు విజయవంతంగా టీకా రెండు డోసులనూ నూటికి నూరు శాతం అందించి నేడు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నిలిచింది. దక్షిణాదిన బెంగళూరు అర్బన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో జిల్లాగా రికార్డు సృష్టించింది. ఈ ఖ్యాతిని అందుకోవడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్ఫూర్తిదాయక చొరవ చూపించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన గతేడాది జిల్లావ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారు 7,92,922 మంది ఉన్నట్లు తేల్చారు. అర్హులందరికీ మొదటి డోసు, అనంతరం రెండో డోసూ వేస్తూ వచ్చారు. ఇటీవల నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడంతో కరీంనగర్‌ జిల్లా ఇతర జిల్లాల కన్నా మెరుగ్గా స్పందించింది. ఈ నెల 24 వరకు 7,85,968 మందికి (99 శాతం) టీకా వేశారు. మంగళవారం రెండో డోసును మరింత మందికి ఇవ్వడంతో ఈ డోసుల సంఖ్య 7,93,353కి చేరింది. దీంతో రెండు టీకాల విషయంలో నూరు శాతం కీర్తిని ఈ జిల్లా అందుకుంది. ఆ తరువాత ఖమ్మం జిల్లా 9,87,883 (93.14 శాతం), యాదాద్రి- భువనగిరి జిల్లా 4,80,526 (91.86 శాతం) ఉన్నాయి.

సమష్టి కృషి.. ప్రత్యేక కార్యాచరణ

కరోనా నుంచి ప్రజల్ని కాపాడే క్రమంలో జిల్లాలో వ్యాక్సినేషనే రక్ష అని గుర్తించిన ఇక్కడి యంత్రాంగం ఈ దిశగా సమష్టి కృషితో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌, డీఎంహెచ్‌వో జువేరియా, ఇతర సిబ్బంది విశేష కృషితో లక్ష్యాన్ని విజయవంతంగా సాధించింది. రాష్ట్రంలో రెండో డోసును నూరు శాతం పూర్తిచేసిన జిల్లాగా ఆ ఘనతను నేడు వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు, మంత్రి గంగుల కమలాకర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని