
ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్ల దాడి
పలువురు కార్యకర్తలకు గాయాలు
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
పోలీసులు, తెరాస శ్రేణులు కలిసే చేశారని ఎంపీ ఫిర్యాదు
ఈనాడు, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా భాజపా నాయకుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ వాహనంతో పాటు మరో ఏడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. నందిపేట్ మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి చేసింది తెరాస శ్రేణులేనని, ఇందులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హస్తం ఉందంటూ ఎంపీ అర్వింద్ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. పోలీసులు వారికి సహకరించారని, నిజామాబాద్ సీపీకీ ఇందులో సంబంధం ఉందంటూ ఆరోపించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీ వినీత్‌కు ఫిర్యాదు చేశారు.
తోపులాట.. రాళ్లదాడి
మండలంలో మంగళవారం ప్రారంభోత్సవాలు, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం ఉదయమే ఆయన బయలుదేరారు. తన పర్యటనను అడ్డుకొనేందుకు తెరాస శ్రేణులు కుట్ర చేస్తున్నాయంటూ మార్గమధ్యలో ఆర్మూర్ మండలం మామిడిపల్లి వద్ద ధర్నాకు దిగారు. వారిని నిలువరించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచే సీపీకి ఫోన్‌చేసి మాట్లాడారు. కాసేపటి తర్వాత నందిపేట్‌కు బయల్దేరగా ఇస్సాపల్లి వద్ద పోలీసులు ఆపి.. ముందుకెళ్తే గొడవలు జరిగే పరిస్థితి ఉందని చెప్పటంతో గంటన్నరపాటు అక్కడే నిలిచిఉన్నట్లు ఎంపీ వివరించారు. పర్యటన రద్దు చేసుకొని వెనక్కి వెళ్తుండగా రెండు వైపుల నుంచి తెరాస కార్యకర్తలు కర్రలు, కత్తులు, రాళ్లతో వచ్చి దాడికి దిగినట్లు చెప్పారు. కొందరు వ్యక్తులు దాడులు చేస్తుండగా.. భాజపా కార్యకర్తలు పరుగులు తీస్తున్న వీడియోలు బయటకొచ్చాయి.
లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా
మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అర్వింద్ నిజామాబాద్ సీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడే విలేకర్లతో మాట్లాడారు. భాజపాకు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెరాస దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. తెరాస వారు దాడికి పాల్పడే అవకాశం ఉందని ఊహించి పోలీసులను అప్రమత్తం చేసినా.. అడ్డుకోలేకపోయారని విమర్శించారు. దీనిపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి 50 వేల ఓట్ల తేడాతో ఓడించకుంటే తన పేరు ధర్మపురి అర్వింద్ కాదని ఎంపీ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, రాజాసింగ్, ఈటల ఫోన్‌చేసి ఘటనపై మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు.
పోలీసుల అండతోనే తెరాస దాడి: సంజయ్
నీలగిరి, న్యూస్‌టుడే: ఎంపీ అర్వింద్, కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో భాజపా బలపడుతుండడంతో అభద్రతతో ముఖ్యమంత్రి, ఆయన సహచరులు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి విపక్ష ప్రజా ప్రతినిధులు పర్యటించినా తట్టుకోలేక తెరాస నాయకులు పోలీసుల అండతో దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన చెందారు. దాడి విషయం చెప్పడానికి పోలీసు కమిషనర్, డీజీపీకి ఫోన్ చేస్తే ఎత్తడం లేదన్నారు. 317జీవో సవరించాలని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నా సీఎం స్పందించడం లేదని.. ఆ ఆందోళనతోనే వరంగల్‌లో రమేశ్ అనే ఉద్యోగి మృతి చెందినట్లు సంజయ్ చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.