రిజిస్ట్రేషన్ల రాబడిలో రారాజు రంగారెడ్డి

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్యలోనైనా.. ఆదాయం పరంగానైనా నేనే నంబరు 1 అంటోంది రంగారెడ్డి జిల్లా. రాష్ట్ర ఖజానాకు సమకూరుతున్న రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 25 శాతం తన నుంచే వస్తోందని సగర్వంగా చెబుతోంది. ఈ అంశంలో రెండో స్థానంలో మేడ్చల్‌-మల్కాజిగిరి,

Published : 26 Jan 2022 03:57 IST

తర్వాత స్థానాల్లో మేడ్చల్‌, హైదరాబాద్‌
నాలుగు జిల్లాల నుంచే సగం ఆదాయం
విలువల పెంపుతో మరింత రాబడి
‘భాగ్య’నగర వలయంపైనే ప్రధాన దృష్టి  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్యలోనైనా.. ఆదాయం పరంగానైనా నేనే నంబరు 1 అంటోంది రంగారెడ్డి జిల్లా. రాష్ట్ర ఖజానాకు సమకూరుతున్న రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 25 శాతం తన నుంచే వస్తోందని సగర్వంగా చెబుతోంది. ఈ అంశంలో రెండో స్థానంలో మేడ్చల్‌-మల్కాజిగిరి, మూడో స్థానంలో హైదరాబాద్‌, నాలుగో స్థానంలో సంగారెడ్డి ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల నుంచే రాష్ట్ర రిజిస్ట్రేషన్ల రాబడిలో సగం పైగా వస్తుండడం మరో విశేషం. రాష్ట్రంలో మరోసారి భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచేందుకు ఆ శాఖ చేస్తున్న కసరత్తులో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

రాష్ట్రం అంతటా పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్‌ (మార్కెట్‌) విలువలను సవరించి 8 నెలలైంది. ఈ మధ్యలోనే రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌, సంగారెడ్డి, భువనగిరి, షాద్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఏడాదిలోపే రెండోసారి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువలను పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తిచేసింది. మరోవైపు ఏటా రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించేలా తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ప్రాధాన్య ప్రాంతాల్లో పెంపుపైనే యంత్రాంగం ప్రత్యేక కసరత్తు నిర్వహించింది. దీంతోపాటు కొత్తగా రియల్‌ఎస్టేట్‌ క్రయ విక్రయాలు జోరుగా ఉన్న మంచిర్యాల, జనగామ, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, కామారెడ్డి ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకున్నారు.  

రంగారెడ్డి జిల్లాలో పెంపునకు ఇదీ లెక్క

హైదరాబాద్‌ చుట్టుపక్కల ఎక్కడా చదరపు అడుగు రూ.3,500 లోపు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు లేవు. అయినా హైదర్‌గూడ, అత్తాపూర్‌ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్‌ (మార్కెట్‌) విలువ చదరపు అడుగుకు రూ.2,400గా ఉంది. మీర్‌పేట, జిల్లెలగూడ, తుర్కయంజాల్‌, చింతలకుంట ప్రాంతాల్లో రూ.2 వేలకు లోపే ఉంది. కీలకమైన సరూర్‌నగర్‌, మియాపూర్‌, మదీనాగూడ, గచ్చిబౌలి, హఫీజ్‌పేట, మాదాపూర్‌, ఖాజాగూడ, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఈ విలువ చదరపు అడుగుకు రూ.3,600గా ఉంది.

స్థలాల అంశంలోనూ వాస్తవ రేట్లకు, గత ఏడాది జులైలో నిర్ణయించిన రిజిస్ట్రేషన్‌ విలువలకు పొంతనలేకుండా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల హైదర్‌గూడ, అత్తాపూర్‌, జిల్లెలగూడ, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో చదరపు గజం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.30 వేలలోపు ఉండగా మణికొండ జాగీర్‌, కోకాపేట, నార్సింగ్‌, మీర్‌పేట ప్రాంతాల్లో ఈ విలువ ఇంకా తక్కువగా రూ.20 వేలలోపే ఉందని అధికారులు విశ్లేషించారు. కోకాపేట, నార్సింగ్‌లో ఎకరా భూమి రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ ఉండగా.. రిజిస్ట్రేషన్‌ విలువ చదరపు గజానికి ఇంకా రూ.17 వేలే అనే అంశాన్ని విశ్లేషణల్లో ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో మార్కెట్‌ విలువల సవరణ మరింత హేతుబద్ధంగా ఉండాలని ఈ ప్రక్రియ చేపట్టినట్లు రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

సీఎం నిర్ణయం అనంతరం జిల్లాలకు

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువల పెంపుపై కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి స్థాయిలో వీటిపై తుది నిర్ణయం అనంతరం కమిటీల ఆమోదానికి జిల్లాలకు పంపనున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని