
కరోనా ఉందంటూ పురుడు పోయలేదు.. ఆసుపత్రి గేటు వద్ద చెంచు మహిళ ప్రసవం
అచ్చంపేట ఏరియా హాస్పటల్ వద్ద ఘటన
అచ్చంపేట న్యూటౌన్, నాగర్‌కర్నూల్, న్యూస్‌టుడే: పురుటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా.. సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది నిరాకరించడంతో అక్కడ గేటు వద్దే చెంచు మహిళకు ప్రసవం అయిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లాలోని బల్మూరు మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మకు మంగళవారం ఉదయం 8 గంటలకు పురుటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు 10 గంటలకు కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు ప్రసవం ఇక్కడ చేయలేమని, పీపీఈ కిట్లు కూడా లేవని చెప్పారు. అప్పటికే మహిళకు నొప్పులు తీవ్రమైనప్పటికి నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని విధుల్లో ఉన్న డా.హరిబాబు సూచించారు. నొప్పులు ఎక్కువవడంతో లాలమ్మను ఆమె వెంట ఉన్న అక్కాచెళ్లెలిద్దరూ ఆసుపత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకెళ్లి పురుడు పోశారు. గమనించిన వైద్య సిబ్బంది బిడ్డను, తల్లిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్ అయిన డా.కృష్ణను వివరణ కోరగా విధుల్లో ఉన్న వైద్యుడు హరిబాబు బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారని, వారు వెళ్లలేదని చెప్పారు.
కరోనా బాధిత చెంచు మహిళకు ప్రసవం చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన డా.హరిబాబును సస్పెండ్ చేయాలంటూ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో వచ్చిన గర్భిణులను చేర్చుకుని ప్రసవాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.