Updated : 26 Jan 2022 05:22 IST

Bharat Biotech: టీకాల ఆవిష్కరణలో తోడూనీడగా..

డాక్టర్‌ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల ఘనత

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయశాస్త్ర పట్టభద్రుడు అమెరికా వెళ్లి మాలిక్యులార్‌ బయాలజీలో పరిశోధనలు చేస్తారని, స్వదేశానికి తిరిగి వచ్చి కరోనా మహమ్మారిని అదుపు చేసే టీకా ఆవిష్కరిస్తారని, భారత్‌ను అగ్రదేశాలతో సమాన స్థాయిలో నిలుపుతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, అటువంటి అద్భుతాన్ని సుసాధ్యం చేసిన ఘనత భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లకు దక్కుతుంది. భార్య సుచిత్ర ఎల్లతో కలిసి పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా స్థాపించిన భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ టీకా ...ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో పాటు ఎన్నో దేశాల్లో గుర్తింపు సంపాదించింది. మనదేశం నుంచి వచ్చిన పూర్తి స్వదేశీ టీకా కూడా ఇదే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు టీకా ఆవిష్కరించిన ఫార్మా/బయోటెక్‌ కంపెనీలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అటువంటి కొద్ది కంపెనీల్లో భారత్‌ బయోటెక్‌ ఒకటి కావటం మన దేశానికెంతో గర్వకారణం. ఎన్నో వ్యాధులకు భారత్‌ బయోటెక్‌ టీకాలు ఉత్పత్తి చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది.   

డాక్టర్‌ కృష్ణ ఎల్ల.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌- మ్యాడిసన్‌ నుంచి మాలిక్యులార్‌ బయాలజీలో పీహెచ్‌డీ చేశారు. తర్వాత సౌత్‌ కరోలినా మెడికల్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఫ్యాకల్టీగా పనిచేశారు. మానవాళి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు టీకాలు అభివృద్ధి చేయడమే పరిష్కారమనేది ఆయన గట్టి నమ్మకం. తనకు ఉన్న అర్హతలు, విజ్ఞానం, అనుభవంతో ఆయన అమెరికాలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంది. కానీ స్వదేశం మీద మక్కువతో కుటుంబంతో సహా వెనక్కి తిరిగి వచ్చారు. భార్య సుచిత్ర ఎల్లతో కలిసి 1996లో హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను స్థాపించారు. హెపటైటిస్‌-బి టీకాతో మొదలు పెట్టి ఎన్నో వ్యాధులకు టీకాలు ఆవిష్కరించారు. అన్నింటికీ మించి కరోనా మహమ్మారికి ‘కొవాగ్జిన్‌’ టీకా రూపొందించే క్రమంలో ఆయన చూపిన చొరవ, ప్రభుత్వంతో కలిసి పనిచేసిన తీరు, ముఖ్యంగా ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ శాస్త్రవేత్తలతో కలిసి నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగిన విధానం.. టీకాను వేగంగా ఆవిష్కరించేందుకు దోహదపడ్డాయి. పశువుల టీకాలు ఉత్పత్తి చేసే సంస్థను కూడా కృష్ణ ఎల్ల స్థాపించారు. ఆహార ప్రాసెసింగ్‌ విభాగంలోకీ అడుగుపెట్టారు. ఇలా పలురకాల వ్యాపార కార్యకలాపాల్లో ఎంత తీరికలేకుండా ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన శాస్త్ర పరిశోధన, పరిశోధన సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొనడం, అనుభవాలను- ఆలోచనలను పంచుకోవడం మాత్రం మానలేదు. శాస్త్ర విజ్ఞానంలో మనదేశానికి తిరుగులేదని నిరూపించాలనే కలను సాకారం చేసేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. 

కార్యశీలి.. సుచిత్ర ఎల్ల.. 

డాక్టర్‌ కృష్ణ ఎల్ల నిత్య పరిశోధకుడు అయితే, స్వదేశానికి తిరిగి వెళ్లి సొంతంగా కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన చేసి, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఘనత ఆయన భార్య, భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లకు దక్కుతుంది. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన ఆమె, కంపెనీ వ్యవహారాలను చక్కబెట్టడంలో క్షణం తీరికలేకుండా ఉంటారు. ఉత్పత్తి నుంచి పరిపాలనా కార్యకలాపాలు, మార్కెటింగ్‌, విక్రయాల వరకూ.. అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు. ఆలోచన, పరిశోధన డాక్టర్‌ కృష్ణ ఎల్లది అయితే, దాన్ని అమలు చేయడంలో సుచిత్ర ఎల్ల పాత్ర కీలకం. భార్యాభర్తలు ఉమ్మడిగా, పట్టుదలగా చేసిన కృషికి ప్రభుత్వ మద్దతు, ప్రభుత్వ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తల సహకారం తోడై  ‘కొవాగ్జిన్‌’ టీకా ఆవిష్కరణ సాధ్యమైందని చెప్పొచ్చు. ఆ టీకానే మనదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని