
కోర్టు ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతారా?
కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండండి
సామాజిక మాధ్యమాలకు ఏపీ హైకోర్టు హెచ్చరిక
ఈనాడు, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించే వ్యవహారంలో సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయస్థానంతో దోబూచులాడుతున్నాయని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అభ్యంతరకర యూఆర్ఎల్లను(యూనిఫాం రిసోర్స్ లొకేటర్)తొలగించాలని సీబీఐ కోరితే 36 గంటల్లో ఎందుకు తొలగించలేదని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమ కంపెనీలపై మండిపడింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతున్నాయని, సరైన స్ఫూర్తితో అమలు చేయడం లేదని ఆక్షేపించింది. ఫలానా పోస్టులు తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేదా కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోరితే తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొన్ని యూఆర్ఎల్లను తొలగించలేదని సీబీఐ, తొలగించామని సామాజిక మాధ్యమ సంస్థలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. ఎన్ని యూఆర్ఎల్లను తొలగించాలని కోరారో ఆ వివరాలను సామాజిక మాధ్యమాలకు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఎన్ని తొలగించారు, మిగిలినవి తొలగింపునకు ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ట్విటర్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను ఆదేశించింది. విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ, అపకీర్తిపాల్జేసే రీతిలో పోస్టులు పెట్టిన వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
మంగళవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. దర్యాప్తు పురోగతిపై నివేదికను కోర్టు ముందు ఉంచారు. ఇప్పటికే 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 17వ నిందితుడిగా పంచ్ ప్రభాకర్‌ను చేర్చామని, 11 మందిని అరెస్ట్ చేసి అభియోగపత్రం వేశామని మిగిలిన వారు విదేశాల్లో ఉన్నారన్నారు. పంచ్‌ప్రభాకర్ విషయంలో కేంద్రం నుంచి అనుమతి రాగానే అభియోగపత్రం వేస్తామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.