బృహత్‌ వనానికి భూమి కొరత

రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన బృహత్‌ ప్రకృతి వనాలకు భూమి కొరత ఏర్పడింది. కనీసం పది ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వసతులు, మొక్కలతో ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎంపిక చేసిన పలు గ్రామాల్లో అనువైన

Published : 26 Jan 2022 05:58 IST

ఇప్పటికి పూర్తయినవి 19 శాతమే
హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో దొరకని స్థలం
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ నెరవేరని లక్ష్యం
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన బృహత్‌ ప్రకృతి వనాలకు భూమి కొరత ఏర్పడింది. కనీసం పది ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వసతులు, మొక్కలతో ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎంపిక చేసిన పలు గ్రామాల్లో అనువైన భూములు లేవు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మండలాల్లో గజం స్థలం దొరకడం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో 5-10 ఎకరాలలోపు ఉన్నా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మండల కేంద్రంతో పాటు, ఆ మండల పరిధిలో కనీసం ఐదు గ్రామాల్లోనూ వాటిని ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 545 మండలాల్లో 2,725 ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. వీటిలో 1,742 చోట్ల మాత్రమే భూముల ఎంపిక ప్రక్రియ ముగిసింది. పూర్తయిన వనాలు కేవలం 529. అంటే 19 శాతమే.

ఆ భూముల్లో మొక్కలు బతకవని...

పలు గ్రామాల్లో గుర్తించిన భూములు వనాల పెంపకానికి అనువుగా లేవు. రెవెన్యూశాఖ వారు ఊరికి దూరంగా గుట్టల్లో  ప్రభుత్వ భూమిని చూపిస్తున్నారు. ఆ స్థలాన్ని చదును చేసినా, అక్కడ మొక్కలు బతకవని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు.
ఈ కారణంగా 289 ప్రకృతి వనాలకు ఇప్పటికే అంచనాలు రూపొందించినా, నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి.హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలుకుతోంది. పంచాయతీరాజ్‌ శాఖ రంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల్లో కనీసం 25 శాతం వనాలకు కూడా భూములను గుర్తించలేకపోయింది. రంగారెడ్డి జిల్లాలో 100 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 21, మేడ్చల్‌లో 25కు 8, మెదక్‌లో 100కు 23 చోట్ల మాత్రమే భూములు గుర్తించారు.  ఖమ్మం జిల్లాలో 100 వనాలు ఏర్పాటు చేయాలని భావిస్తే కేవలం 16 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావాటికి భూములు దొరకడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని