ఏపీ కొత్త జిల్లాల పేర్లలో మార్పులు

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం... ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటనలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 26 జిల్లాలకు సంబంధించి గెజిట్‌

Published : 27 Jan 2022 03:27 IST

ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం... ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటనలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 26 జిల్లాలకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పేర్లకు సంబంధించి మంగళవారం రాత్రి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, ఆ తర్వాత జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేన్లలో పేర్కొన్న దానికీ స్వల్ప తేడాలున్నాయి. కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లా అని పేరు పెట్టినట్లు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో పేర్కొన్నారు. ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు పెట్టినట్లు తెలిపారు. గెజిట్‌ నోటిఫికేషన్లలో మాత్రం... కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు కాకినాడ జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఏలూరు జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పశ్చిమగోదావరి అని పేరు పెట్టినట్లుగా తెలిపారు. అలాగే రెండు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేబినెట్‌ మెమోరాండంలో పేర్కొనగా, గెజిట్‌ నోటిఫికేషన్‌లో కనిగిరి పేరు తీసేశారు. కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీసత్యసాయి జిల్లాలో పెనుగొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని పేర్కొనగా, గెజిట్‌ నోటిఫికేషన్‌లో పెనుగొండ, పుట్టపర్తితోపాటు ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

‘కొత్త జిల్లాకు అల్లూరి పేరు హర్షణీయం’

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఏపీలో పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు  అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం హర్షణీయమని క్షత్రియ సేవాసమితి తెలంగాణ, ఏపీ అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా కేంద్రం జాతీయస్థాయిలో గుర్తింపునివ్వడం, ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం నిజమైన నివాళి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని