కర్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రులకు హైకోర్టు సన్మానం

కర్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రులను బుధవారం హైకోర్టు ఘనంగా సన్మానించింది. సరిహద్దులో చైనా సైనికులతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి.. దేశం కోసం ప్రాణాలర్పించిన

Published : 27 Jan 2022 03:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: కర్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రులను బుధవారం హైకోర్టు ఘనంగా సన్మానించింది. సరిహద్దులో చైనా సైనికులతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి.. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్‌బాబు సేవలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుర్తుచేసుకుంది. ఆయన తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా ఓ కొత్త సంప్రదాయానికి హైకోర్టు నాంది పలకడంపై హర్షం వ్యక్తమైంది. సంతోష్‌బాబు తల్లిదండ్రులు బిక్కుమల్ల ఉపేందర్‌, మంజుల దంపతులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ శాలువాలు కప్పి జ్ఞాపిక బహూకరించారు. తమను ప్రత్యేకంగా పిలిపించి సన్మానించడంపై ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఐఏఎంసీతో నూతన అధ్యాయం: సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)ను ఆవిష్కరించడం లీగల్‌ వ్యవస్థలో సరికొత్త అధ్యాయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ అన్నారు. గణతంత్ర దినోత్సవంలో భాగంగా హైకోర్టులో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. కొత్తగా ఏడుగురి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుతం ఆరుగురు మహిళా న్యాయమూర్తులున్నారని చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ 434 మంది జడ్జీల్లో 221 (52 శాతం) మంది మహిళలేనని తెలిపారు. గత ఏడాది అక్టోబరులో నియమితులైన 66 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలతో కలిపి 227 మంది నియామకాలు పూర్తయ్యాయని, 4 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని వివరించారు. కొత్తగా 31 కోర్టులు ఏర్పాటయ్యాయన్నారు. రెవెన్యూ జిల్లాలతో సమానంగా జ్యుడిషియల్‌ జిల్లాల ఏర్పాటుకు హైకోర్టు ప్రయత్నిస్తోందన్నారు. ‘‘గత ఏడాది కొవిడ్‌ సంక్షోభంలోనూ కోర్టుకు వచ్చే కేసుల సంఖ్య తగ్గలేదు. 57 వేల కేసులు దాఖలుకాగా 40 వేల వరకూ పరిష్కరించాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ తదితరులు ప్రసంగించారు. న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని