శత్రువులకు వణుకు పుట్టించే ‘తారా’జువ్వలు..

నగరంలో డీఆర్‌డీవోకు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ), డీఆర్‌డీఎల్‌ అభివృద్ధి చేసిన 5 సరికొత్త అస్త్రాల్ని రాజ్‌పథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బుధవారం తొలిసారి

Published : 27 Jan 2022 03:55 IST

హైదరాబాద్‌ ఆర్‌సీఐ నుంచి 5 సరికొత్త అస్త్రాలు

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో తొలిసారి ప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో డీఆర్‌డీవోకు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ), డీఆర్‌డీఎల్‌ అభివృద్ధి చేసిన 5 సరికొత్త అస్త్రాల్ని రాజ్‌పథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బుధవారం తొలిసారి ప్రదర్శించారు. యుద్ధ విమానం నుంచి ప్రయోగించే వీటికి అస్త్ర, రుద్రం, సా, గౌరవ్‌, తారా అనే పేర్లు పెట్టారు. శత్రువుల గుండెల్లో మోగే పాంచ్‌ పటాకాలుగా వీటిని అభివర్ణిస్తున్నారు. అస్త్ర, రుద్రం క్షిపణుల రూపకల్పనలో హైదరాబాద్‌ మిసైల్‌ కాంప్లెక్స్‌లోని డీఆర్‌డీఎల్‌ కీలక పాత్ర పోషించగా.. సా, గౌరవ్‌, తారా అభివృద్ధిలో ఆర్‌సీఐ పాలుపంచుకుంది. వీటితో పాటు తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపర్చే లక్ష్యంతో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన అధునాతన ఎలక్ట్రానిక్‌ స్కాన్డ్‌ అర్రే(ఏఈఎస్‌ఏ) రాడార్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ జామర్‌ను డీఆర్‌డీవో శకటంలో ప్రదర్శించారు.


పాంచ్‌ పటాకాల ప్రత్యేకతలు..

అస్త్ర: గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. తేజస్‌ యుద్ధ విమానం నుంచి ఇప్పటికే పలుమార్లు ప్రయోగాత్మకంగా పరీక్షించారు.  
రుద్రం: కొత్తతరం యాంటీ రేడియేషన్‌ క్షిపణి. శత్రు రాడార్లను, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది. 250 కి.మీ. పరిధి వరకు పనిచేస్తుంది. 5.5 మీటర్ల పొడవు ఉంటుంది. 60 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళుతుంది. 2020లో దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సా: స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ ఫీల్డ్‌ వెపన్‌. 100 కి.మీ. పరిధిలో శత్రువుల బంకర్లు, వైమానిక స్థావరాలను కూల్చేస్తుంది. 80 కిలోల బరువు ఉంటుంది. హక్‌-ఐ విమానం, సుఖోయ్‌ నుంచి  గత ఏడాది విజయవంతంగా ప్రయోగించారు. భారత వైమానిక దళానికి అందజేశారు. 

గౌరవ్‌: లాంగ్‌ రేంజ్‌ గైడెడ్‌ గ్లైడ్‌ బాంబ్‌. వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు. 4 మీటర్ల పొడవు, వెయ్యి కిలోల బరువు ఉంటుంది. సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి గత ఏడాది విజయవంతంగా ప్రయోగించారు. 

తారా: బంకర్ల వంటి లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు టాక్టికల్‌ అడ్వాన్స్‌ రేంజ్‌ అగ్మెంటేషన్‌(తారా) ఆయుధాన్ని ఆర్‌సీఐ అభివృద్ధి చేస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు వెల్లడించలేమని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని