వంటింటి దినుసులతో ఒమిక్రాన్‌ నుంచి ఉపశమనం

రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. బాధితుల్లో అత్యధికులకు ఒమిక్రాన్‌ సోకుతోందని ఇటీవల ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌లో ఎగువ శ్వాసకోశ సంబంధిత సాధారణ

Updated : 27 Jan 2022 05:12 IST

సాధారణ లక్షణాలున్న వారికి ఆయుర్వేద చిట్కాలు

ఇంట్లోనే ఉంటూ కోలుకునే వెసులుబాటు

రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. బాధితుల్లో అత్యధికులకు ఒమిక్రాన్‌ సోకుతోందని ఇటీవల ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌లో ఎగువ శ్వాసకోశ సంబంధిత సాధారణ ఇబ్బందులే తలెత్తుతున్నాయి. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించడం లేదు. అధిక శాతం బాధితులు ఇంటి వద్దే కోలుకుంటున్నారు. ఇలాంటి వారు వంటింటి దినుసులను ఉపయోగించుకుని కూడా కొంత ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతులో గరగర, గొంతు నొప్పి తదితర సాధారణ సమస్యలను ఇంట్లో వాడే పదార్థాలతోనే సాంత్వన పొందొచ్చని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.ఉమాశ్రీనివాస్‌ తెలిపారు. 14 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ వైద్యం ఉపయోగపడుతుందన్నారు. ఆ చిట్కాలు ఆయన మాటల్లోనే...

* జ్వరం, జలుబు, దగ్గు: అమృత (గుడూచి) ఆకులను దంచి రసాన్ని తీసి, టీస్పూన్‌ చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. ఇలా అయిదు రోజులు చేస్తే.. జ్వరం, గొంతు నొప్పి తగ్గుతాయి. లేదా మహాలక్ష్మి విలాసరస్‌, లక్ష్మి విలాసరస్‌ మాత్రలు ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 5 రోజులపాటు వేసుకోవచ్చు.


* దగ్గు: నాలుగు మిరియాలు దంచి తులసి ఆకుల రసంలో కలిపి ఉదయం, సాయంత్రం టీ స్పూన్‌ వంతున నాలుగు రోజులు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. గొంతునొప్పి పోవాలంటే పాలల్లో 5-6 గ్రాముల మిరియాల పొడి వేసి 5-7 రోజులపాటు తాగాలి.


* తలనొప్పి: శొంఠి అరగదీసి కణతలపై ఉదయం, సాయంత్రం  పూసుకోవాలి.


* జలుబు, దగ్గు: పుదీనా ఆకు, తమలపాకుల రసం తీసి ఉదయం, సాయంత్రం టీ స్పూన్‌ చొప్పున తీసుకోవాలి. దీంతో పాటు ఒక లవంగ మొగ్గను నోట్లో వేసుకొని చప్పరించాలి.


* గొంతు నొప్పి: త్రిఫల చూర్ణాన్ని టీ స్పూన్‌ వంతున గ్లాసుడు  గోరు వెచ్చటి నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం పుక్కిలించాలి.


పొడి దగ్గు: కరక్కాయ ముక్కను నోట్లో పెట్టుకొని రసం వచ్చేలా చప్పరిస్తూ ఉండాలి. ఇలా 3-5 రోజుల పాటు చేయాలి.


* మొండి దగ్గు: వాస (అడ్డసరం)ఆకు రసం తీసి టీ స్పూన్‌ వంతున ఉదయం, సాయంత్రం 5 రోజులపాటు తీసుకోవాలి.



 

* గొంతు గరగర: చిటికెడు పచ్చి పసుపును వేడి పాలలో వేసుకొని తాగాలి.


* ఇవి కాకుండా మహా సుదర్శన మాత్రలను ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 5 రోజులు తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చిత్రక హరిత లేహ్యం చెంచా వంతున ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి బయట పడవచ్చు.


* సాధారణ లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఈ చిట్కాల్లో అందుబాటులో ఉన్నవి ఎంచుకుని వినియోగించవచ్చు. తీవ్రమైన లక్షణాలతో పాటు ఆక్సిజన్‌ తగ్గిపోవడం, అయిదు రోజులు దాటినా తగ్గని జ్వరం, తీవ్ర నీరసం, వాంతులు, విరేచనాలు, అపస్మారక స్థితి, పల్స్‌ తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని