
కొత్తగా 3,944 కొవిడ్ కేసులు
మరో ముగ్గురి మృతి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 3,944 కొవిడ్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 7,51,099కి పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో ముగ్గురు మరణించడంతో ఇప్పటి వరకూ 4,081 మంది కన్నుమూశారు. వైరస్ బారిన పడ్డ అనంతరం చికిత్స పొంది తాజాగా 2,444 మంది కోలుకోగా మొత్తంగా 7,07,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 27న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్.జి.శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 39,520 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97,549 నమూనాలను పరీక్షించగా మొత్తం పరీక్షల సంఖ్య 3,17,76,018కి పెరిగింది. మరో 5,537 నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,372 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డిలో 259, ఖమ్మంలో 135, సంగారెడ్డిలో 120, హనుమకొండలో 117, నిజామాబాద్‌లో 105, సిద్దిపేటలో 104, భద్రాద్రి కొత్తగూడెంలో 101, పెద్దపల్లిలో 95, నల్గొండలో 91, కరీంనగర్‌లో 80, మహబూబ్‌నగర్‌లో 79, వరంగల్‌లో 78, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో 76 చొప్పున, జగిత్యాలలో 67, సూర్యాపేటలో 66, వనపర్తిలో 64, మెదక్‌లో 60, నాగర్‌కర్నూలులో 59, వికారాబాద్ జిల్లాలో 56 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 2,58,770 కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు.
ఏపీలో 13,474 పాటిజివ్‌లు
ఏపీలో బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 41,771 నమూనాలు పరీక్షించారు. వీటిద్వారా 13,474 మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేట్ 32.2%గా నమోదైంది గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు.
చిరంజీవికి సీఎం కేసీఆర్ పరామర్శ
కరోనా బారిన పడిన సినీనటుడు చిరంజీవిని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. వైద్యుల సలహా మేరకు హోంక్వారంటైన్‌లో ఉన్నారు. గత రెండు రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆయనకు కొన్ని నెలల కిందట తొలిసారి కొవిడ్ సోకింది.
మందు ఇస్తానంటే..ప్రభుత్వం నోటీసు ఇచ్చింది
ఆనందయ్య ఆవేదన
మంగళగిరి, న్యూస్‌టుడే: కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా మందు ఇస్తానంటే ఆయుష్ శాఖ తనకు నోటీసు ఇచ్చిందని నెల్లూరుకు చెందిన మూలికా వైద్యుడు ఆనందయ్య తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం బీసీ వెల్ఫేర్ జేఏసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనాకు సంబంధించి ఎలాంటి వేరియంట్లనైనా తన వద్దనున్న మూలికల ద్వారా నయం చేయవచ్చన్నారు. లక్షల మందికి కొవిడ్ సోకకుండా మందు ఇచ్చానని గుర్తు చేశారు. అయినప్పటికీ తాను నిరక్షరాస్యుడనని, వైద్యం చేయడానికి అనర్హుడనని ఆయుష్ శాఖ నోటీసులో పేర్కొందని తెలిపారు. తన ప్రయత్నాన్ని నిలుపుదల చేయించేందుకే ఇలా యత్నిస్తోందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.