Published : 28 Jan 2022 05:20 IST

మరో రెండు క్యాథ్‌ల్యాబ్‌లు

త్వరలో సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలో ఒక్కోటి రూ.7 కోట్లతో అందుబాటులోకి
నేడు ఖమ్మంలో ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
గుండె వైద్యంలో మెరుగైన సేవలు

ఈనాడు - హైదరాబాద్‌: గుండెజబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ సౌకర్యం త్వరలో సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ బోధనాసుపత్రుల్లో రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్‌ల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి. గాంధీలో ఈ సౌకర్యం కల్పించినా ఉపయోగించక పాడవడంతో మరో 2 నెలల్లో కొత్తగా నెలకొల్పడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మూడింటితో పాటు ఖమ్మంలో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ను శుక్రవారం వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ మినహా జిల్లాల్లో నెలకొల్పనున్న తొలి క్యాథ్‌ల్యాబ్‌ ఇదే. వీటికి అదనంగా వచ్చే ఏడాదికి సిద్దిపేటలో, 2024లో మహబూబ్‌నగర్‌ బోధనాసుపత్రిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.7 కోట్ల వ్యయం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తాజాగా వైద్యఆరోగ్యశాఖ సర్కారుకు నివేదించింది. క్యాథ్‌ల్యాబ్‌లో గుండెజబ్బులకు పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలుంటాయి.

రోగులకు మేలు
* ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో నెలకొల్పిన అధునాతన క్యాథ్‌ల్యాబ్‌ విశేష సేవలందిస్తోంది. ఇప్పుడు జిల్లాల్లో ఏర్పాటు చేయడం ద్వారా గుండె చికిత్సల వికేంద్రీకరణ జరుగుతుంది.
* గుండె రక్తనాళాల్లో పూడికలుంటే క్యాథ్‌ల్యాబ్‌లో గుర్తించవచ్చు. స్థానికంగానే సరిచేయవచ్చు. అప్పుడు హైదరాబాద్‌కు రావాల్సిన శ్రమ తప్పుతుంది.
* ఖమ్మం క్యాథ్‌ల్యాబ్‌ పరిధిలో మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, మహబూబాబాద్‌ తదితర 12 అనుబంధ చికిత్స కేంద్రాలను చేర్చారు.
* వీటిల్లో టెలీ ఈసీజీ యంత్రాలను పెట్టారు.
* గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తికి ఈ కేంద్రాల్లో వైద్యుడు ముందుగా ఈసీజీ తీస్తారు. వెంటనే ఆ ఫలితం కాపీ ఆన్‌లైన్‌లో ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని క్యాథ్‌ల్యాబ్‌లో సేవలందిస్తున్న గుండె వైద్యనిపుణుడికి చేరుతుంది.
* ఆ ఫలితాన్ని వైద్యుడు ఆన్‌లైన్‌లో పరీక్షించి.. ఒకవేళ అందులో తేడాలున్నట్లుగా గుర్తిస్తే.. వెంటనే రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఇంజక్షన్‌(థ్రాంబోలైసిస్‌) ఇవ్వమని సూచిస్తారు.
* థ్రాంబోలైసిస్‌ ఇచ్చిన అనంతరం రోగి ఆరోగ్యం కుదుటపడగానే.. అక్కడ్నించి ఖమ్మం తరలించి, రక్తనాళాల్లో పూడికలున్నాయా అని తెలుసుకునే పరీక్ష(యాంజియోగ్రామ్‌) చేస్తారు. అవసరమైతే స్టెంటు చికిత్స(యాంజియోప్లాస్టీ) కూడా చేస్తారు.
* అచ్చంగా ఇదే తరహా విధానాన్ని సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలోనూ అమలు చేయనున్నారు.

బహుళ ప్రయోజనాలు
* ఈ క్యాథ్‌ల్యాబ్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవి. ఇందులో ‘3 డి ఇమేజ్‌’ వెసులుబాటు ఉంటుంది.
* ‘ఫ్రాక్షనల్‌ ఫ్లో రిజర్వు’ విధానం కూడా ఉంటుంది. అంటే గుండె రక్తనాళాల్లో ఒక్కోసారి 50-60 శాతం పూడికలు ఏర్పడితే దీనికి స్టెంట్‌ వేయలా వద్ద అనేదాన్ని గుర్తించడానికి ‘ప్రెజర్‌ వైర్‌’ను వాటి వద్ద పెడతారు. తద్వారా పూడిక వద్ద రక్త ప్రసరణ ఒత్తిడిని గుర్తిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని స్టెంట్‌ వేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు.
* గుండె కవాటాల మార్పిడి, మరమ్మతులు, పేస్‌మేకర్‌ అమర్చడం, గుండె చుట్టూ నీరు చేరడం(పెరికార్డియల్‌ ఎఫ్యూజన్‌) వంటి వాటికి చికిత్సలు కూడా ఇందులోనే చేస్తుంటారు.
* గుండె రక్తనాళాల్లోనే కాదు.. చేతుల్లో, కాళ్లలోని రక్తనాళాల్లో కూడా స్టెంట్లను వేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్లోమగ్రంధిలోనూ స్టెంట్లు వేయాల్సి ఉంటుంది. వీటిని కూడా క్యాథ్‌ల్యాబ్‌లోనే చేస్తారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని