ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల ఏర్పాటుపై అసంతృప్తి సెగలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో కొన్నిచోట్ల నిరసనలు, అసంతృప్తులు రేగుతున్నాయి. మరికొన్నిచోట్ల కొత్త ఆకాంక్షలు బయటపడుతున్నాయి. ఇంకొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసన సెగలూ రాజుకుంటున్నాయి.

Published : 28 Jan 2022 03:22 IST

జిల్లా కేంద్రాలను మార్చాలని డిమాండ్లు
పేర్లు పెట్టిన తీరుపైనా అభ్యంతరాలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో కొన్నిచోట్ల నిరసనలు, అసంతృప్తులు రేగుతున్నాయి. మరికొన్నిచోట్ల కొత్త ఆకాంక్షలు బయటపడుతున్నాయి. ఇంకొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసన సెగలూ రాజుకుంటున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, సకల సౌకర్యాలు, అందరికీ అందుబాటు... ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరేచోట్ల జిల్లాకేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. కొన్ని జిల్లాల పేర్లపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తీరుపై విద్యార్థులు, సాధారణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భగ్గుమన్నారు. ప్రస్తుత కడప జిల్లాలో... రాజంపేటను కాదని రాయచోటిని జిల్లాకేంద్రం చేయడంపై అక్కడి నాయకులు పార్టీలకు అతీతంగా మండిపడ్డారు. పురపాలక సంఘ కార్యవర్గం మొత్తం రాజీనామాకు సిద్ధపడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లాకేంద్రంగా చేయకుండా రాయచోటిలో కలపడమేంటని ఆ ప్రాంతంలో నిరసన మంటలు చెలరేగాయి. విజయవాడలో కలిసిపోయిన పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కృష్ణాజిల్లాలో కలపడంపై ఆ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న శృంగవరపుకోటను విజయనగరంలో కలపడం, నర్సీపట్నాన్ని చేయకపోవడంపై ఆయా ప్రాంతాల్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. అధికారపక్ష ప్రజాప్రతినిధులు సైతం ఈ రెండింటి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల విభజన ప్రభావం విశాఖపట్నం నగర పరిధిలోని పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలపై ఎక్కువగానే కనిపిస్తోంది. తిరుపతి కేంద్రంగా తలపెట్టిన జిల్లాకు శ్రీబాలాజీ కాకుండా తిరుపతిగానే పేరు ఉంచాలన్న డిమాండు ఉంది. దగ్గర్లో ఉన్న ఒంగోలును కాదని.. అద్దంకి నియోజకవర్గాన్ని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్లలో కలపడాన్ని అక్కడి వైకాపా నేతలు వ్యతిరేకించారు. శ్రీసత్యసాయి జిల్లాకు హిందూపురాన్నే కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండుచేశారు. ‘ఎన్టీఆర్‌’ జిల్లాను స్వాగతిస్తున్నట్లు నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇది తెలుగువాళ్లు గర్వపడే నిర్ణయమన్నారు.

శాస్త్రీయంగా వ్యవహరించాం
కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్‌ విలేకర్లతో మాట్లాడారు. జిల్లాల్ని విభజించేటప్పుడు దూరం, భౌగోళిక విస్తీర్ణం, జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నామన్నారు. దీంతోపాటు అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండేలా చూసేందుకు కొన్నిచోట్ల దూరాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. కొత్త జిల్లాల్లో ఒక కలెక్టర్‌, ఒక జేసీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాల పేర్లపై వచ్చే వినతులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని