
Telangana: మొగిలయ్యకు హైదరాబాద్‌లో ఇల్లు
నిర్మాణానికి రూ. కోటి ఆర్థిక సాయం
సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రగతిభవన్‌లో సత్కారం
ఈనాడు, హైదరాబాద్: పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌లో ఇంటి స్థలం కేటాయించి.. రూ.కోటితో ఇంటి నిర్మాణంతో పాటు ఇతరత్రా అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పద్మశ్రీ పురస్కారం నేపథ్యంలో శుక్రవారం సీఎం ఆయనను ప్రగతిభవన్‌కు ఆహ్వానించి శాలువాతో సత్కరించి తన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించి విశిష్ట పురస్కారం అందజేసిందని, ప్రతీ నెలా రూ.పదేసి వేల చొప్పున గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని చెప్పారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని పేర్కొంటూ ఆయనకు పద్మశ్రీ పురస్కారం రావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ‘‘పద్మశ్రీ మొగిలయ్య అరుదైన కళాకారుడు. ఆయన కళ తెలంగాణ జాతి సంపద. అది కలకాలం ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఆయన వినతి మేరకు హైదరాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోసం రూ.కోటి ఇస్తాం. ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తాం’’ అని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి ఆయనతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. సీఎస్ సోమేశ్‌కుమార్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.