Updated : 29 Jan 2022 04:38 IST

Supreme Court: సుదీర్ఘకాలం సస్పెన్షన్‌ చెల్లదు

చట్టసభల్లో దుష్ప్రవర్తనపై చర్య.. ఆ సెషన్‌ వరకే

మహారాష్ట్రలో 12 మంది భాజపా ఎమ్మెల్యేల ఏడాది సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

దిల్లీ: అనుచిత ప్రవర్తన పేరుతో చట్టసభల నుంచి సభ్యులను సుదీర్ఘ కాలం పాటు సస్పెండ్‌ చేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారిపై విధించే చర్య ఆ సమావేశం(సెషన్‌) వరకే పరిమితం కావాలని తెలిపింది. సస్పెన్షన్‌ కాల వ్యవధి.. కొనసాగుతున్న సమావేశం పరిధిని మించితే దాని ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తంపై పడుతుందని అభిప్రాయపడింది. విపక్ష సభ్యుల సంఖ్యను అప్రజాస్వామిక పద్ధతుల్లో తగ్గించడం అంటే స్వల్ప మెజార్టీ ఉన్న ప్రభుత్వ మనుగడకు అవకాశం కల్పించినట్లేనని పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి తమను ఏడాది పాటు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ 12 మంది భాజపా ఎమ్మెల్యేలు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. శాసనసభ్యుల ఏడాది పాటు సస్పెన్షన్‌ ... బహిష్కరణ, సభ్యత్వ రద్దు, రాజీనామా కన్నా దారుణమైన చర్యగా జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘‘12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం చట్టరీత్యా చెల్లదని ప్రకటిస్తున్నాం. 2021 జులైలో వర్షాకాల సమావేశాల్లో చేసిన ఆ తీర్మానంలో పేర్కొన్న సస్పెన్షన్‌ కాల వ్యవధి ఆ సెషన్‌ కాల పరిమితిని మించి ఉండడం రాజ్యాంగ వ్యతిరేకం. చట్టవిరుద్ధం. నిర్హేతుకం’’ అని పేర్కొంటూ 90 పేజీల తీర్పును వెలువరించింది. శాసనసభ సభ్యులుగా వారికి లభించే ప్రయోజనాలన్నీ సస్పెన్షన్‌ కాల వ్యవధిలోనూ పొందటానికి అర్హులుగా పేర్కొంది. సభ్యులపై చర్య తీసుకోవడానికి చట్టసభకు అధికారం ఉన్నప్పటికీ..దానిని సక్రమంగా, క్రమపద్ధతిలో, అంచెలంచెలుగా వినియోగించాలని స్పష్టం చేసింది. సభ్యులను సుదీర్ఘ కాలంపాటు సస్పెండ్‌ చేస్తూ వెళ్తే విపక్షం సభలో జరిగే చర్చల్లో ప్రభావవంతంగా పాల్గొనలేదని పేర్కొంది. అటువంటి చర్చలకు అర్థం ఉండదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన అదుపు తప్పుతున్న పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయి. అయితే వారిపై తీసుకునే చర్యలు రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారం, సహేతుకంగా, నియమ నిబంధనల ప్రకారం ఉండాల్సిందేనని విస్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రిసైడింగ్‌ అధికారితో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ 2021 జులై5న.. 12 మంది భాజపా ఎమ్మెల్యేలను సభ నుంచి ఏడాది పాటు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. దీనిని సవాల్‌చేస్తూ భాజపా శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

భాజపా హర్షం

సుప్రీంకోర్టు తీర్పుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, మహారాష్ట్రలో ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ హర్షం వ్యక్తం చేశారు. సత్యం సాధించిన విజయంగా నడ్డా అభివర్ణించారు. శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు వంటిదని ఫడణవీస్‌ పేర్కొన్నారు.

తీర్పు ప్రతి వచ్చాక స్పీకర్‌ నిర్ణయం..

చట్టసభలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ అన్నారు. కోర్టు అధికారాలకు మధ్య ఒక విభజన రేఖ ఉంటుందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత శాసనసభ స్పీకర్‌ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టసభల అధికారాల్లో కోర్టుల జోక్యం సరికాదని అభిప్రాయపడ్డారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని