తెలంగాణ జ్వర సర్వేకు కేంద్రం ప్రశంస

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని....

Updated : 29 Jan 2022 05:41 IST

అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి

ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి హరీశ్‌

ఈటీవీ, ఖమ్మం-ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. కరోనా పరిస్థితులపై మాండవీయ శుక్రవారం వివిధ రాష్ట్రాల్లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్‌ విభాగాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీశ్‌ ఇక్కడి కలెక్టరేట్‌ నుంచే కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి మాండవీయ కొనియాడారు. మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ రెండో దశ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘ఇటీవల చేపట్టిన మూడో దశ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 21,150 బృందాలు పాల్గొంటున్నాయి. ‘ఈ సర్వేలో ప్రత్యేక బృందాలు 77,33,427 ఇళ్లను పరిశీలించి కరోనా లక్షణాలున్న వారికి 3,45,951 కిట్లు అందించాయి. రెండో రౌండ్‌ సర్వే చేపడుతాం. కొవిడ్‌ పరీక్షలకు 2 కోట్ల కిట్లు, కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి. 86 ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 27 వేల పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాం, జ్వర సర్వేతో ప్రభుత్వ వైద్యాన్ని ఇంటి వద్దకే తీసుకెళ్లాం’’ అని వివరించారు.

అందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వాలి: 18 సంవత్సరాలు దాటిని ప్రతి పౌరుడికీ బూస్టర్‌ డోస్‌ టీకా ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. రెండో డోస్‌ తర్వాత బూస్టర్‌ డోస్‌ టీకా అందించేందుకు కాల వ్యవధి తగ్గించాలన్నారు. కేంద్రం సరఫరా చేసిన వెంటిలేటర్స్‌ కోసం హ్యుమిడీఫయర్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, టీఎస్‌ఎంఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌ రమేశ్‌రెడ్డి, సీఎంవో ఓఎస్‌డీ గంగాధర్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, కలెక్టర్‌ గౌతమ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని