Published : 29 Jan 2022 04:05 IST

సమారోహ ఉత్సవం.. ఏర్పాట్లు ఘనం

సమతామూర్తి విగ్రహావిష్కరణకు సిద్ధమవుతున్న ముచ్చింతల్‌

దాదాపు పూర్తయిన రహదారుల నిర్మాణం, విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎంత దూరం నుంచైనా చిరునవ్వుతో పలకరించే తేజస్సు.. ఎన్నెన్నో ప్రత్యేకతలతో ఏర్పాటైన 216 అడుగుల దివ్యసుందర  రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణోత్సవాలకు సిద్ధమవుతోంది. శంషాబాద్‌ సమీపాన ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఫిబ్రవరి 2న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

రేయింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులు

సమతాస్ఫూర్తి కేంద్రం కొలువైన 45 ఎకరాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. చదును పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్రం చుట్టూ పచ్చదనం ఏర్పాటు పనులు పూర్తి కావొచ్చాయి. రెండు రోజుల్లో కొలిక్కి తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది. వందలాది మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. 108 దివ్య ఆలయాల ఫ్లోరింగ్‌ పనులు చకాచకా సాగుతున్నాయి. భద్రవేదిలోని అంతస్తులను శుభ్రం చేస్తున్నారు. రెండో అంతస్తులో 120 కిలోల బంగారు రామానుజాచార్యుల మూర్తిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

వివిధ మార్గాలు ఇలా..

సమారోహ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు హాజరు కానున్నారు. దీనికి తగ్గట్టుగా రాకపోకలకు వీలుగా రహదారుల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. సమతాతిస్ఫూర్తి కేంద్రానికి చేరుకునేందుకు వేర్వేరు మార్గాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 5 కిలోమీటర్ల పొడవునా మదనపల్లి నుంచి పది మీటర్ల వెడల్పున రూ.17.5 కోట్లతో సిమెంటు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. శ్రీరామనగరం ఆశ్రమం వద్ద జంక్షన్లు అభివృద్ధి చేసి తారు వేసి చదును చేశారు. గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్‌ వరకు రహదారిని నిర్మించి పీ7 రోడ్డుకు అనుసంధానించారు. దీనివల్ల ఎయిర్‌పోర్టుకు కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. అలాగే పీ7 రోడ్డును ఆరు లేన్లుగా విస్తరించి ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. తొండుపల్లి జంక్షన్‌ నుంచి గొల్లపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. పెద్దషాపూర్‌ తండా, బూర్జుగడ్డ తండాల మీదుగా వెళ్లే రహదారులను విస్తరించారు. రూ.1.50 కోట్లతో 11/33కేవీ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి రావడంతో విద్యుత్తు పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు చెబుతున్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని