
Medaram Jatara: మేడారం జాతర... మహా సవాల్
జాతరకు కోటిమంది రావొచ్చని అంచనా
ఇప్పటికే ప్రారంభమైన భక్తుల రాక
కొవిడ్ నేపథ్యంలో నిబంధనల అమలుపై మరింత దృష్టి అవసరం
ఈనాడు, వరంగల్: ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం మహాజాతర వైద్య ఆరోగ్య శాఖకు సవాల్‌గా మారనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు సుమారు కోటిమంది తరలివస్తారని అంచనా. ఇప్పటికే వేలాదిగా భక్తుల రాక మొదలైంది. కొవిడ్ మూడోదశ ఉద్ధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో అవసరమైన ఏర్పాట్లు చేయడం, నిబంధనలు పాటించేలా చూడటం ముఖ్యం. జాతరకు వచ్చేవారంతా కచ్చితంగా మాస్కు ధరించేలా చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లక్షల్లో మాస్కులను ఉచితంగా పంపిణీ చేయడం, ధరించని వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేయాల్సి ఉంటుంది. లక్షణాలున్న వారిని గుర్తించేందుకు థర్మల్ స్క్రీనర్లు వేల సంఖ్యలో అవసరం అవుతాయి. కొవిడ్ తీవ్రత పెరిగి ఎవరికైనా అత్యవసర చికిత్స అందించాల్సి వస్తే వారి కోసం ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాలుండాలి. ములుగు జిల్లాల్లో పెద్ద ఆసుపత్రులు ములుగు, ఏటూరునాగారంలో ఉన్నాయి. మేడారం నుంచి ములుగు 47 కిలోమీటర్లు, ఏటూరునాగారం 35 కి.మీ.ల దూరంలో ఉంది. చికిత్స అవసరమైతే రద్దీలో అంత దూరం తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి మేడారంలోనే కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. జాతరకు అనేక ప్రాంతాల నుంచి గర్భవతులు వస్తారు. వారి కోసం లేబర్ రూం అవసరం. ఈ అంశాలపై అధికార యంత్రాంగం వీటిపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు.
సిబ్బంది సరిపోయేనా?
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది జాతరలో సుమారు 1100 మంది వరకు ఉన్నారు. వీరిలో 150 వరకు వైద్యులు ఉంటారు. గత సంవత్సరం దాదాపు ఇంతే సంఖ్యలో వెద్య సిబ్బంది పనిచేశారు. ఈసారి కొవిడ్ నేపథ్యంలో వీరి సంఖ్య పెంచడంపై దృష్టిసారించాలి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్నవారిలో ఇప్పటికే 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్వచ్ఛంద సంస్థల సేవలు కూడా వినియోగించుకోవాలి. భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్నందున గద్దెల ప్రాంతంతోపాటు జంపన్నవాగు, గిరిజన మ్యూజియం తదితర ప్రాంతాల్లో శానిటైజేషన్ నిరంతరం కొనసాగాలి. జాతరకు రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు మాత్రమే రావాలనే ప్రతిపాదన పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొవిడ్ నేపథ్యంలో మాస్కులను విరివిగా పంపిణీ చేస్తామని, నిబంధనల అమలుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నామని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య తెలిపారు.
నేడు మేడారానికి... ముగ్గురు మంత్రులు, సీఎస్, డీజీపీ
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పరిశీలనకు శనివారం ముగ్గురు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మేడారం రానున్నారు. వీరితో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం ఏర్పాట్లు పరిశీలించనున్నారు. స్థానిక అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకుంటారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారు. మంత్రులు, ఉన్నతాధికారులు రానున్న నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు చేపట్టనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.