వైద్యులు పనిచేయకుంటే నాతో చెప్పండి

వైద్యులు సక్రమంగా పని చేయకుంటే ఆశా కార్యకర్తలు తనకు మెసేజ్‌ చేయాలని వైద్యమంత్రి హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు 4జీ స్మార్ట్‌ఫోన్లు, సిమ్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కామారెడ్డిలో ఆదివారం ప్రారంభించారు. ఆశాలకు గుజరాత్‌లో

Published : 14 Feb 2022 04:22 IST

 ఆశాలకు మంత్రి హరీశ్‌రావు సూచన

4జీ స్మార్ట్‌ఫోన్లు, సిమ్‌ల పంపిణీ

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: వైద్యులు సక్రమంగా పని చేయకుంటే ఆశా కార్యకర్తలు తనకు మెసేజ్‌ చేయాలని వైద్యమంత్రి హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు 4జీ స్మార్ట్‌ఫోన్లు, సిమ్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కామారెడ్డిలో ఆదివారం ప్రారంభించారు. ఆశాలకు గుజరాత్‌లో రూ.4 వేలు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో రూ.3 వేలు ఇస్తుండగా.. తెలంగాణలో రూ. 9,750 ఇస్తున్నామన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం స్మార్ట్‌ ఫోన్లు ఇస్తున్నట్లు చెప్పారు. వీటివల్ల గర్భిణుల ఆరోగ్య సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేసే వీలుంటుందన్నారు. అవసరమైతే వీడియో కాల్‌ ద్వారా వైద్యులతో మాట్లాడి రోగులకు సేవలందించవచ్చన్నారు. రాష్ట్రంలోని 27 వేల మంది ఆశాలకు వీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు. ఏఎన్‌ఎంలకు త్వరలో ఐ-ప్యాడ్‌లు అందజేస్తామని తెలిపారు. రెండేళ్లుగా ఆసుపత్రి అభివృద్ధి నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగిందని, ఇకపై ఏటా క్రమం తప్పకుండా మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది పీహెచ్‌సీల అభివృద్ధికి రూ.5 లక్షలు చొప్పున అందిస్తామని తెలిపారు. దీర్ఘకాలిక రోగుల కోసం ప్రత్యేకంగా ఔషధాల కిట్లు తయారు చేస్తున్నామన్నారు. 

ఒప్పంద ఉద్యోగులకు ప్రాధాన్యం

ఉత్తర తెలంగాణలో అధికంగా సిజేరియన్లు జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందని, దీన్ని నివారించాలంటే ఆశాలు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భవిష్యత్తులో పీహెచ్‌సీల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని, పని చేయకుంటే ఉపేక్షించనని హెచ్చరించారు. వైద్యులకు పీజీ సీట్లలో 30 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఒప్పంద వైద్యులు, సిబ్బందికి ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు సురేందర్‌, హన్మంత్‌శిండే, పద్మాదేవేందర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కరుణ, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని