రష్యా ఆధిపత్యమే పుతిన్‌ లక్ష్యం

ప్రాంతీయ ఆధిపత్యం మాత్రమే కాకుండా రష్యాను గ్లోబల్‌ ప్లేయర్‌ చేయాలన్నది పుతిన్‌ లక్ష్యమని, రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన మాటల్లో ఈ విషయం స్పష్టమవుతోందని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం

Updated : 28 Feb 2022 05:07 IST

నాటో సభ్యత్వంపై రష్యా అభ్యంతరాలు పట్టించుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం
జేఎన్‌యూ ప్రొఫెసర్‌ భస్వతి సర్కార్‌

 ఈనాడు, హైదరాబాద్‌

ప్రాంతీయ ఆధిపత్యం మాత్రమే కాకుండా రష్యాను గ్లోబల్‌ ప్లేయర్‌ చేయాలన్నది పుతిన్‌ లక్ష్యమని, రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన మాటల్లో ఈ విషయం స్పష్టమవుతోందని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ప్రొఫెసర్‌ భస్వతి సర్కార్‌ పేర్కొన్నారు. నాటో సభ్యత్వంపై రష్యా ఎప్పటికప్పుడు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పశ్చిమదేశాలు పరిగణనలోకి తీసుకోకపోవడమూ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన యుద్ధాలలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి భిన్నమైందన్నారు. సెంటర్‌ ఫర్‌ రష్యన్‌ స్టడీస్‌లో పరిశోధన చేసిన ఈమె ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ యూరోపియన్‌ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దారితీసిన కారణాలు, భవిష్యత్‌ పరిణామాలపై ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా  రష్యా చాలా తీవ్రంగా స్పందించడానికి కారణమేంటి?
2014లో క్రిమియాను రష్యా కలుపుకొన్నప్పటి నుంచి బ్లాక్‌సీ ప్రాంతంలో నాటో ఉనికి పెరగడంతో పాటు ఉక్రెయిన్‌, జార్జియాలకు సహకారం ఎక్కువైంది. 2016లో వార్సా సదస్సు తర్వాత నాటో నేరుగా రంగప్రవేశం చేసి ఉక్రెయిన్‌కు సహాయ ప్యాకేజీని ప్రకటించడంతో పాటు ఆ దేశ బలగాలకు శిక్షణ ఇవ్వడంలో తాము సాయం చేశామని పదేపదే చెప్పింది. 2014 వేరు, ఇప్పుడు వేరని నాటో చీఫ్‌ తరచూ అనే వారు. ఈ కారణంగా ఉక్రెయిన్‌ డీ మిలటరైజేషన్‌ తమ లక్ష్యమని పుతిన్‌ చెబుతుండేవారు.

ప్రస్తుత సంక్షోభంలో అమెరికా పాత్ర ఏంటి?
యూరప్‌ భద్రతాపరమైన అంశాల్లోనూ.. నాటో, ఇతర భాగస్వామ్యాల్లో అమెరికా కీలకం. బాల్టిక్‌ స్టేట్స్‌, పోలాండ్‌, ఇతర తూర్పు యూరోపియన్‌ దేశాలు భద్రతకు సంబంధించి అమెరికా వైపు చూస్తుంటాయి. రష్యా తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా పవర్‌ను, ప్రపంచంలో దాని స్థానాన్ని ఛాలెంజ్‌ చేస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్‌, చైనాలు ఎలా చూస్తున్నాయి. ఈ ప్రభావం భారతదేశంపై ఏమైనా ఉంటుందా?
భారత్‌కు, చైనాకు రష్యాతో సంబంధాలు, సొంత సమీకరణాలున్నాయి. బ్రిక్స్‌లో ఈ దేశాలు భాగం. గత డిసెంబరులో వార్షిక సదస్సుకు పుతిన్‌ వచ్చారు. కరోనా తీవ్రత తర్వాత రష్యా అధ్యక్షుడు సందర్శించిన మొదటి దేశం భారత్‌. మనకు రక్షణ సంబంధాలు చాలా ముఖ్యం. భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని దౌత్యపరమైన పరిష్కారం కనుక్కోవాలని భారత్‌ సరిగానే చెప్పింది. ప్రధానమంత్రి మోదీ రష్యా అధ్యక్షుడితో మాట్లాడటం చాలా ముఖ్యమైన పరిణామం. అయితే పుతిన్‌ చర్య దురాక్రమణ అని చెప్పడానికి చైనా తిరస్కరించడంతో పాటు అమెరికా, పశ్చిమదేశాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పింది. అమెరికా-చైనా మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా ఈ విషయంలో చైనా అమెరికా పక్కన చేరే అవకాశాలు చాలా తక్కువ.

ఈ యుద్ధం నాటో విస్తరణకు దారితీసే అవకాశం ఉందా? దీని పర్యవసానాలు ఏంటి?
ప్రస్తుత సంఘర్షణ నాటో విస్తరణకు దారితీస్తుందనుకోను. ఇప్పటికే తీవ్రస్థాయిలో ఘర్షణలతో ఉన్న దేశాలను నాటో చేర్చుకోదు. అయితే యూరోపియన్‌ యూనియన్‌లో విభజన, నాటో బలహీనపడటం, సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు దగ్గరకావడం వంటివి జరగవచ్చు. నార్డ్‌ స్ట్రీం-2(రష్యా నుంచి జర్మనీకి బాల్టిక్‌ సముద్రం ద్వారా 1,230 కి.మీ దూరం గ్యాస్‌ పైప్‌లైన్‌ వేయడం)పై చాలా యూరోపియన్‌ దేశాలకు, ప్రత్యేకించి అమెరికాకు అభ్యంతరాలున్నాయి. దీన్ని రద్దు చేయాలంటున్నాయి. ఈ అంశం చర్చకు రావచ్చు. గతంలోలా కాకుండా ఉక్రెయిన్‌పై దాడి విషయంలో యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ప్రస్తుతం ఒక్కటిగా స్పందిస్తున్నాయి. నా అంచనా ప్రకారం సభ్య దేశాలకు నాటో మిలిటరీ అండగా ఉండటంతో ఉక్రెయిన్‌ దాటి రష్యా తూర్పు యూరప్‌ వైపు వెళ్లే అవకాశాలు లేవు. మరోవైపు నాటోతోనూ రష్యా సంబంధాలు నెరిపింది. అణ్వాయుధాలను మోహరించరాదు, సరిహద్దు భూభాగంలోని వారికి సభ్యత్వం ఇవ్వరాదు లాంటి రష్యా నిబంధనలను నాటో అంగీకరించింది కూడా. ఇరు పక్షాల సంప్రదింపుల కోసం శాశ్వత సంయుక్త కౌన్సిల్‌ కూడా ఏర్పాటైంది. అయితే నాటో విస్తరణ, ఇరాక్‌ యుద్ధం అంశాలు సంబంధాలను దెబ్బతీశాయి. రెండోసారి పుతిన్‌ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఉక్రెయిన్‌, జార్జియాలకు నాటో సభ్యత్వం అంశం ముందుకు రావడంతో రాజకీయ, మిలిటరీ పర్యవసానాలపై రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పశ్చిమ దేశాలు దృష్టి పెట్టలేదు. పర్యవసానంగా పరిస్థితి ఇక్కడివరకు వచ్చింది.

ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమెవరు?
పైకి చూసినపుడు కారణం రష్యానే కనిపిస్తోంది. లోతుగా పరిశీలిస్తే అమెరికా, పశ్చిమదేశాలు రష్యాతో సరిగా వ్యవహరించకపోవడం, సమానంగా చూడకపోవడం. రష్యా చెప్పేదాన్ని పట్టించుకోకుండా సార్వభౌమాధికారం గల దేశాలు సొంత నిర్ణయాలు తీసుకొంటాయని వాదించడం కారణం. మరోవైపు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇచ్చే అవకాశం లేదని నాటో కూడా చెప్పిన నేపథ్యంలో  రష్యా ఆ దేశంతో చర్చించాల్సింది. రష్యాలో ఓ చిన్న ప్రాంతం ఉక్రెయిన్‌ అని పుతిన్‌ అనుకొంటున్నట్లుగానే, స్వతంత్రత కలిగిన ప్రాంతంగా అవసరమైన నిర్ణయాలు తీసుకొనే అధికారం తమకూ ఉందంటోంది ఉక్రెయిన్‌. అయితే ఉక్రెయిన్‌ తూర్పు-పశ్చిమగా విడిపోయిందన్న అంశం కూడా వాస్తవం. రష్యన్లు, రష్యన్‌ భాష మాట్లాడే తూర్పు ప్రాంతవాసులు మాస్కోతో మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే పేరుతో ప్రపంచానికి మరింత హాని జరుగుతోంది. ఇరాక్‌ దీనికి మంచి ఉదాహరణ.

అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, వీటి భాగస్వామ్యదేశాలు బలహీనపడి యుద్ధానంతర పర్యవసానాలను తట్టుకొనే పరిస్థితులో లేవనే కారణంతోనే పుతిన్‌ ముందడుగు వేశారంటారా?
పశ్చిమలో వచ్చిన విభజనను అంచనా వేసుకొనే పుతిన్‌ ప్రస్తుతం ముందడుగు వేశారనే వాదనను కొందరు చేస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో బలగాల ఉపసంహరణ విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. తాజాగా ఆస్ట్రేలియా-యునైటెడ్‌ కింగ్‌డం-యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (ఎ.యు.కె.యు.ఎస్‌) మధ్య జరిగిన ఒప్పందం ఫ్రాన్స్‌కు మనస్తాపం కలిగించింది. అయితే 2014 నుంచి మిన్స్‌క్‌ ఒప్పందాన్ని అమలు చేయకపోవడం, నాటో సభ్యత్వ లక్ష్యంగా 2019లో ఉక్రెయిన్‌ రాజ్యాంగ సవరణలు చేసే ప్రయత్నం చేయడం లాంటి చర్యలు పుతిన్‌లో మరింత పట్టుదలను పెంచినట్లు కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని