వైద్యుల పనివేళలపై నిఘా

ప్రాథమిక వైద్య కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా కఠిన చర్యలు చేపట్టాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాలు, గ్రామీణ,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు.

Published : 05 Mar 2022 05:19 IST

ప్రాథమిక వైద్య కేంద్రాల్లో సీసీ కెమెరాలు
బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి
వచ్చే నెల 1 నుంచి అన్ని పీహెచ్‌సీల్లో అమలు


ఈనాడు-హైదరాబాద్‌: ప్రాథమిక వైద్య కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా కఠిన చర్యలు చేపట్టాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాలు, గ్రామీణ,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు. అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఈసీఐఎల్‌ సంస్థ అందించనుంది. కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చే వారంలో ప్రయోగాత్మకంగా అమలు చేసి, వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలోని అన్ని బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీల్లోనూ ఆచరణలోకి తేనున్నారు. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో..అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సేవలందిస్తున్నాయి. అత్యధిక చోట్ల సమయపాలన పాటించడం లేదని గుర్తించిన సర్కారు ఈ ఏర్పాట్లు చేయనుంది. ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను పెట్టి వాటిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణకు అనుసంధానం చేస్తారు.  సమయపాలనను పరిశీలించడమే కాకుండా..ఓపీ ఎంతుంది? ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా? తదితర అంశాలను కూడా పరిశీలించ వచ్చని, ఓపీ నమోదు అవకతవకలపై కూడా దృష్టిసారించవచ్చని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు     వివిధ పథకాల నేపథ్యంలో కొన్ని పీహెచ్‌సీల్లో   ఎక్కువ మంది సిబ్బంది ఉండగా.. మరికొన్ని చోట్ల కొరత ఏర్పడింది. ఈ వ్యత్యాసాన్ని  సరిదిద్దే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని