Microsoft: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ అతిపెద్ద డేటా కేంద్రం

ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ దేశంలో తన నాలుగో డేటా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. దీనికోసం దశల వారీగా 15 ఏళ్ల కాలంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సోమవారం హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల

Updated : 08 Mar 2022 04:53 IST

ఈనాడు - హైదరాబాద్‌

ఐటీ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ దేశంలో తన నాలుగో డేటా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. దీనికోసం దశల వారీగా 15 ఏళ్ల కాలంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సోమవారం హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు ఈ వివరాలను తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక, వస్తున్న అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదొకటని వివరించారు. మైక్రోసాఫ్ట్‌ దేశంలో అతి పెద్ద డేటా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందున, స్థానికంగా ఎన్నో వ్యాపారాల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు వీలవుతుందన్నారు. డేటా, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్‌ ఇంజినీరింగ్‌ నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. గత ఏడేళ్లలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ కేంద్ర ఉద్యోగుల సంఖ్య 3 రెట్లు పెరిగి 9,000కు చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం క్లౌడ్‌ సేవలను వినియోగించుకునేందుకు మైక్రోసాఫ్ట్‌ ఎంతో సహకరిస్తోందన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పుణె, ముంబయి, చెన్నైలలోని తమ డేటా కేంద్రాల సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌ డేటా కేంద్రం తొలిదశ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తొలుత ఇది తక్కువ సామర్థ్యంతోనే ప్రారంభమైనా, దశల వారీగా అతి పెద్ద డేటా కేంద్రంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడులూ అందుకు తగ్గట్టుగానే ఉంటాయన్నారు. ఈ కొత్త కేంద్రం క్లౌడ్‌ను మరింత శక్తిమంతం చేయడంతో పాటు, అంకుర సంస్థలకు సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఐడీసీ నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్‌కు దేశంలో ఉన్న 3 డేటా కేంద్రాల ద్వారా 2016-20 మధ్య 9.5 బిలియన్‌ డాలర్ల ఆదాయం (సుమారు రూ.71,000 కోట్లకు పైగా) ఆర్థిక వ్యవస్థకు చేరిందని, 1.50 లక్షల ఉద్యోగాలు, 1.69 లక్షల మంది నిపుణుల తయారీకి ఇవి తోడ్పాటునందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రిఫ్మాన్‌, రాష్ట్ర ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

రెండేళ్లలో 120 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు

దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రాలు ఎంతో తోడ్పాటునందిస్తాయని, దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. దేశంలో ఇంటర్నెట్‌ వాడుతున్న వారి సంఖ్య 80 కోట్ల వరకూ ఉందని, రెండేళ్లలో ఈ సంఖ్య 120 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటలీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని, అన్ని ప్రభుత్వ విభాగాలు యాప్‌ల ద్వారా సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

రూ.276 కోట్లతో స్థలాల కొనుగోలు

మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న డేటా కేంద్రం కోసం మూడు స్థలాలను రూ.276 కోట్లతో కొనుగోలు చేసిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. పొత్తూరు సమీపంలోని మేకగూడలో 22 ఎకరాలు, షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, చందనవెళ్లిలో 52 ఎకరాలు సమకూర్చుకున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ స్థిరాస్తి సేవల సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఈ లావాదేవీలను పూర్తి చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని