కృష్ణా, గోదావరి బోర్డుల పాపం కాంగ్రెస్‌దే..

కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పింది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. వాటి ప్రస్తావనతో కాంగ్రెస్‌ ప్రాజెక్టులకు ఉరి వేస్తే.. నేటి భాజపా ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు

Published : 15 Mar 2022 04:10 IST

రాష్ట్రం ఫిర్యాదుతోనే రాయలసీమ లిఫ్టుపై కోర్టు స్టే ఇచ్చింది
శాసనసభలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పింది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. వాటి ప్రస్తావనతో కాంగ్రెస్‌ ప్రాజెక్టులకు ఉరి వేస్తే.. నేటి భాజపా ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. గోదావరిపై ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ఆరు నెలల క్రితమే గోదావరి బోర్డుకు ప్రభుత్వం ఇచ్చింది. రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతోనే రాయలసీమ ఎత్తిపోతలపై కోర్టు స్టే విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ పూర్తిచేయడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కరవు తాండవం చేసింది. ఎంతోమంది వలస పోయేవారు. కాంగ్రెస్‌ పాలనలో బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి గాక మరేముంది? కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించాం. గోదావరి, కావేరి అనుసంధానం పెద్ద జోకు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయ్యాకనే అనుసంధానం విషయం ఆలోచిస్తామని సీఎం ఎన్నోసార్లు చెప్పారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు రూ. 77,852 కోట్లు వ్యయం చేశాం. పాదయాత్రలో మల్లన్నసాగర్‌తోపాటు మిగిలిన జలాశయాలు కూడా భట్టి విక్రమార్క సందర్శించొచ్చు. ఆ నీటిని నెత్తినపోసుకుంటే కాంగ్రెస్‌ పాలనలో చేసిన    పాపాలైనా పోతాయి’’ అని అన్నారు.

భావితరాల బాగు కోసమే అప్పులు

భావితరాల అవసరాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం క్యాపిటల్‌ వ్యయానికే అప్పులు చేస్తున్నాం. ఏటా ఎఫ్‌ఆర్‌బీఎంను కేంద్రం, ఆర్‌బీఐ పరిమితులు, నిబంధనల మేరకు సవరించుకోవడం ప్రహసనంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఏడాదికి ముందుగానే పెంచుకునేందుకు చట్టాన్ని సవరించుకుంటున్నాం. దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో కింది నుంచి పైకి నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది. దేశం అప్పుల శాతం 62.6 కాగా తెలంగాణది 27 శాతం మాత్రమే. అప్పులు విషయంలో కాంగ్రెస్‌ ఆందోళన అర్థం లేనిది. వాస్తవానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పంజాబ్‌ (మొన్నటి వరకు) 49.1, ఛత్తీస్‌గఢ్‌ 28.6, రాజస్థాన్‌ 42.6 శాతం అప్పులు చేశాయి. దేశంలో అనేక రాష్ట్రాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. మనం చేసిన అప్పులతో ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు, మౌలిక వసతులు కల్పించుకుంటున్నాం. అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆయా పద్దులపై సమాధానాలు ఇచ్చారు.

పలు బిల్లులకు ఆమోదం

ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు, మార్కెట్‌ కమిటీల్లో పాలకవర్గ సభ్యుల సంఖ్య, కాలపరిమితి పెంపు బిల్లులను సభ ఆమోదించింది. సాగునీటి పారుదల, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, రహదారులు-భవనాలు, ఇంధనశాఖ, న్యాయశాఖ, ప్రణాళిక-ఆర్థిక శాఖల పద్దులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని