Yadadri: ఇల యాదాద్రి పురములో..

ఒకనాటి యాదగిరి‘గుట్ట’ కొత్త రూపు సంతరించుకుంది.. కృష్ణ శిలలతో నిర్మితమైన దివ్యధామంగా.. దేశంలోనే పేరెన్నికగన్న ప్రఖ్యాత ఆలయాల చెంత చేరనుంది.. పట్టణం నలువైపులా పచ్చదనం

Updated : 28 Mar 2022 07:29 IST

రూ.2,000 కోట్లతో ప్రణాళిక.. ప్రధానాలయానికే రూ. 250 కోట్లు

ఒకనాటి యాదగిరి‘గుట్ట’ కొత్త రూపు సంతరించుకుంది.. కృష్ణ శిలలతో నిర్మితమైన దివ్యధామంగా.. దేశంలోనే పేరెన్నికగన్న ప్రఖ్యాత ఆలయాల చెంత చేరనుంది.. పట్టణం నలువైపులా పచ్చదనం అలరారేలా తీర్చిదిద్దారు..

ఆధ్మాత్మిక నగరిగా యాదాద్రి కొత్త రూపం సంతరించుకుంది.. గిరి ప్రదక్షిణకు ప్రత్యేక రహదారి.. కాటేజీలు, ప్రెసిడెన్షియల్‌ సూట్లు.. ఒకటని కాదు ఎన్నెన్నో ఏర్పాట్లు. అర ఎకరం మాత్రమే ఉండే ఆలయ ప్రాంగణం ఇప్పుడు నాలుగెకరాల వరకు విస్తరించగా.. విశాలమైన మాడ వీధులు.. ఎత్తయిన గోపురాలు.. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శిల్పాల సోయగాలు, కనువిందు చేసేలా పచ్చదనం! భక్తుల వసతి కోసం ఏర్పాట్లు.. కొండ దిగువన ఒకేసారి మూడు వేల మంది స్నానాలు చేసేందుకు వీలుగా విష్ణు పుష్కరిణి, పక్కనే భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణ కట్ట.

యాదాద్రి ఆలయం కొత్త సొబగులు సంతరించుకుంటుండగా దానితోపాటే యాదగిరి పట్టణం కూడా రోజురోజుకూ విస్తరిస్తోంది. మౌలిక వసతుల కల్పన శరవేగంగా సాగుతోంది. అందమైన రింగ్‌రోడ్డు.. చక్కటి ట్యాంక్‌బండ్‌.. ఊరినిండా ఉద్యానవనాలతో సరికొత్తగా ముస్తాబెంది.

ఆలయ నగరిలో ఆధ్యాత్మిక వీచికలతోపాటు సౌగంధిక పరిమళాలు వెదజల్లేలా పూలవనాలు.. నీడనిచ్చే వృక్షాలను పెంచుతున్నారు. గిరి ప్రదక్షిణ దారి పొడవునా భక్తుల్ని పచ్చదనం అలరిస్తుంది..కొండచుట్టూనే కాకుండా ఆలయ నగరి, గండిచెరువు ప్రాంగణంలోనూ వేలకొద్దీ మొక్కల్ని నాటారు. అటవీశాఖ అధీనంలో దాదాపు 150 హెక్టార్ల మేర నరసింహ అభయారణ్యం, ఆంజనేయ అభయారణ్యాలను అభివృద్ధి చేశారు.

ఈ క్షేత్రం అభివృద్ధితో పాటు సమీపంలోని భువనగిరి పట్టణం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించడంతో యాదగిరిగుట్ట, భువనగిరి రెండు పట్టణాలూ కలిసిపోతున్నాయి. 1950 నాటికి గుట్ట జనాభా 500లోపే. ప్రస్తుతం దాదాపు 20,000 మంది నివసిస్తున్నారు. భువనగిరి ప్రస్తుత జనాభా 55,000. యాదగిరిగుట్ట రెండేళ్ల క్రితం వరకు మేజర్‌ గ్రామ పంచాయతీగా 8 చ.కి.మీ. విస్తీర్ణం ఉండగా.. ప్రస్తుతం పురపాలికగా మారి పెద్దిరెడ్డిగూడెం, పాతగుట్ట గ్రామాల విలీనంతో 12 చ.కి.మీ. మేరకు విస్తరించింది. అంతర్గత రహదారులను వెడల్పు చేశారు. ప్రధాన మార్గమైన రాయిగిరి నుంచి యాదగిరి పట్టణం వరకు విశాలమైన రహదారులు, మధ్యలో డివైడర్లను నెలకొల్పారు. కూడళ్లలో పూల మొక్కలు, పచ్చిక బయళ్లతో మెరుగులద్దారు. చెరువు వద్ద ట్యాంక్‌బండ్‌ మరో ప్రత్యేక ఆకర్షణ.

రక్షణగోడతో విస్తరణ
ఆలయ పునర్నిర్మాణం, విస్తరణలో కీలకమైనది రక్షణగోడ. దీని నిర్మాణానికి యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ (యాడా) అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించింది. అర ఎకరం వరకే ఉండే ఆలయ ప్రాంగణాన్ని నాలుగెకరాల వరకు విస్తరించగలిగారు. గతంలో మొత్తం గుట్ట దాదాపు 14 ఎకరాల విస్తీర్ణం ఉండగా.. కొండకు ఉత్తర, పశ్చిమ, దక్షిణ దిశలలో దాదాపు 3 ఎకరాల వరకు పెంచారు. కొండంతా సమతలంగా చదును చేశారు. ఆలయం మొత్తం కృష్ణశిలలతో కడుతున్నందున సుమారుగా రెండు లక్షల టన్నుల రాయి బరువును మోసేలా రూ. 165 కోట్ల ఖర్చుతో కింది నుంచి కొన్నిచోట్ల 100 అడుగుల ఎత్తులో మూడు దిక్కుల్లోనూ నాలుగు దశల్లో రెండేళ్లపాటు ఈ గోడ నిర్మాణం సాగింది. ఎక్కడెక్కడ ఎంత ఎత్తులో నిర్మిస్తున్నారో, ఎంత కాంక్రీట్‌, స్టీలును ఉపయోగిస్తున్నారనే అంశాలపై ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయం నేరుగా పర్యవేక్షించింది.. కొండ సహజ సిద్ధ రూపం కోల్పోకుండా పూర్తిగా కాంక్రీటుతో నింపకుండా జాగ్రత్త వహించారు. భారీ, అతి భారీ వర్షాలు పడ్డా తట్టుకునేలా జేఎన్‌టీయూ, వరంగల్‌ నిట్‌ నిపుణులు దీని పటిష్ఠతను పరీక్షించారు. దీని నిర్మాణం కోసం స్టీలు, సిమెంటుకే దాదాపు రూ. 100 కోట్ల వరకు ఖర్చయినట్లు అధికారవర్గాల సమాచారం.


ప్రధాన ఘట్టాలివి..

* ప్రధానాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం 2016 అక్టోబరు 11 విజయదశమి మంగళవారం రోజున

* ఆలయానికి ఉపయోగించిన రాయి (కృష్ణశిల): 2.5 లక్షల టన్నులు

* సేకరించింది: గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో గల కమ్మవారిపాలెం.

* గర్భాలయం ఎదురుగా ఉన్న మహాముఖమండపంలో 12 అళ్వారుల విగ్రహాలను 12 అడుగుల ఎత్తులో రూపొందించారు.

* ప్రధానాలయంలో 6 వేలకు పైగా శిల్పాలను శిల్పకారులు తయారు చేశారు.

* ధ్వజ స్తంభం 35 అడుగుల ఎత్తులో కర్రతో రూపొందించారు. దీనిని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల నుంచి సేకరించారు.

* రోజుకూ సగటున 8 వేల మంది భక్తులు వస్తారని అంచనా. పర్వదినాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య 40 వేల వరకు ఉండొచ్చు.

* ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు ఆలయ నగరి అభివృద్ధి, ఇతర వసతుల కోసం రూ.2 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టగా... కేవలం ప్రధానాలయ నిర్మాణానికే సుమారు రూ. 250 కోట్లు ఖర్చుచేశారు.

* గిరి ప్రదక్షిణ కోసం కొండ చుట్టూ 5.5 కి.మీ. మేర వలయ రహదారిని నిర్మించారు.


- ఈనాడు, నల్గొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని