రైతన్నలను కడుపులో పెట్టుకొందాం

తెలంగాణలో ఉన్నది రైతు ప్రభుత్వమని, వారిని కడుపులో పెట్టుకొని చూసుకుందామని, ఎలాంటి సమస్యలెదురైనా వడ్లను రాష్ట్రమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అన్నదాతకు ఏ కష్టం రాకుండా నిశ్చింతగా ఉండేలా

Published : 13 Apr 2022 02:47 IST

అదే మనకు ప్రాధాన్యం  
వారి కోసం ఎంతైనా వెచ్చిద్దాం
మంత్రిమండలి భేటీలో సీఎం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్నది రైతు ప్రభుత్వమని, వారిని కడుపులో పెట్టుకొని చూసుకుందామని, ఎలాంటి సమస్యలెదురైనా వడ్లను రాష్ట్రమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అన్నదాతకు ఏ కష్టం రాకుండా నిశ్చింతగా ఉండేలా ఎంత ఖర్చైనా భరిస్తామని చెప్పారు. వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలన్నారు. అతి ముఖ్యమైన రైతు సమస్యలపై కేంద్రం దగాను ఎండగడదామన్నారు. అడుగడుక్కీ భాజపా నేతలను నిలదీసేలా కార్యక్రమాలు చేపడదామన్నారు. నష్టాలను భరించి ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవను రైతుల ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో నాలుగు గంటల పాటు మంత్రిమండలి సమావేశం జరిగింది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వడ్ల కొనుగోలు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులు కమలాకర్‌, నిరంజన్‌రెడ్డిలు రాష్ట్రంలో వరిసాగు, ధాన్యం కొనుగోలు ప్రణాళిక, వ్యయాలు, సమస్యల గురించి తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా అన్నింటినీ అధిగమించి వెంటనే వడ్ల కొనుగోలుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు అనంతరం వాటిని రైస్‌మిల్లర్లకు గానీ, వ్యాపారులకు గానీ విక్రయించే యోచన లేదు. మనమే మిల్లింగు చేయించి, ముడి బియ్యం తయారు చేయిద్దాం. దానిని కేంద్రమే కొనుగోలు చేసేందుకు ఒత్తిడి తెస్తాం. 111 జీవో వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. పోడు భూములు, ఎసైన్డ్‌ భూముల వంటి వాటినీ పరిష్కరిద్దాం. దీనికి మంత్రులు చొరవ చూపాలి’’ అని సీఎం తెలిపారు.

గవర్నర్‌ అంశంపై...

సమావేశంలో అధికారిక ఎజెండా అనంతరం రాష్ట్రగవర్నర్‌ వ్యవహారశైలిపై మంత్రిమండలిలో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గవర్నర్‌ అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నట్లు తెలిసింది. చాలా అంశాలపై ఆమెది వితండవాదమని, రాష్ట్ర ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని